చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జూలు విదిల్చింది. సొంతగడ్డపై లక్నో సూపర్ జయింట్స్ పై రెచ్చిపోతూ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108,12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీతో కదం తొక్కగా.. శివమ్ దూబే (27 బంతుల్లో 66, 3 ఫోర్లు, 7 సిక్సులు) మెరుపు హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నైకు తొలి ఓవర్లలోనే బిగ్ షాక్ తగిలింది. రహానే ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
రచీన్ రవీంద్ర స్థానంలో వచ్చిన మిచెల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ ఈ కివీస్ బ్యాటర్ 10 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరో ఎండ్ లో గైక్వాడ్ దూకుడుగా ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. రవీంద్ర జడేజాతో కలిసి మూడో వికెట్ కు 52 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 28 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జడేజా(16) ఔటైనా దూబే, గైక్వాడ్ జోడీ లక్నో బౌలర్లను ఒక ఆటాడుకున్నారు.
వీరిద్దరూ బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోర్ శర వేగంతో ముందుకు కదిలింది. యష్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలో గైక్వాడ్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్ లో దూబే 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ 46 బంతుల్లోనే 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్నో బౌలర్లలో హెన్రీ, మోషీన్ ఖాన్,యాష్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.
Ruturaj Gaikwad's century and Shivam Dube's fiery innings have propelled CSK's score to 210 runs on the board! 🔥 pic.twitter.com/pwLT1foRcV
— CricTracker (@Cricketracker) April 23, 2024