- 5 వికెట్లతో రాజస్తాన్‌పై గెలుపు
- రాణించిన సిమర్‌జీత్, గైక్వాడ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్‌లో ముందుకెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో విజయం సాధించింది. టాస్ నెగ్గిన రాజస్తాన్ 141/5 స్కోరు చేయగా.. చేజింగ్‌లో చెన్నై 18.2 ఓవర్లలో 145/5 స్కోరు చేసి నెగ్గింది.
చెన్నై : సొంత గడ్డపై చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. బౌలర్లు సిమర్‌జీత్ (3/26), తుషార్ దేశ్‌పాండే (2/30)కు తోడు రుతురాజ్ గైక్వాడ్ (41 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) రాణించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 141/5 స్కోరు చేసింది. రియాన్ పరాగ్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. తర్వాత చెన్నై 18.2 ఓవర్లలో 145/5 స్కోరు చేసి నెగ్గింది. సిమర్జీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలింగ్ ఆదుర్స్..
స్టార్టింగ్‌లో తుషార్,, మహేశ్ తీక్షణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి (24), బట్లర్ (21) రన్స్ చేయడానికి ఇబ్బందులుపడ్డారు. పవర్‌ప్లే మొత్తంలో ఆరు ఫోర్లు, జైస్వాల్ కొట్టిన ఒక సిక్స్ మాత్రమే ఉండటంతో స్కోరు 42/0గా నమోదైంది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన సిమర్‌జీత్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దర్ని ఔట్ చేశాడు. దీంతో రాయల్స్ 49/2తో కష్టాల్లో పడింది. కెప్టెన్ శాంసన్ (15)తో జత కలిసిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 రన్స్ వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్‌ను తీక్షణ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
వీరిద్దరు సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబడుతూ క్రీజులో కుదురుకున్నారు. అయితే 15వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన సిమర్‌జీత్.. శాంసన్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. 16 ఓవర్లలో 103/3తో ఉన్న రాయల్స్‌కు మెరుగైన స్కోరు అందించేందుకు పరాగ్, ధ్రువ్ జురెల్ (28) హిట్టింగ్‌కు దిగారు. కానీ పిచ్ స్లోగా ఉండటంతో భారీ షాట్లు సాధ్యం కాలేదు.
ఆఖరి ఓవర్లో తుషార్ ఫస్ట్ బాల్‌కే జురెల్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 40 రన్స్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి బాల్‌కు శుభమ్ దూబే (0)ను ఔట్ చేయడంతో రాయల్స్ చిన్న టార్గెట్‌కే పరిమితమైంది.
గెలిపించిన రుతురాజ్
చిన్న స్కోరు ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ చివరి వరకు క్రీజులో నిలిచి చెన్నైని గెలిపించాడు. రాయల్స్ బౌలర్లు విజృంభించినప్పుడల్లా తన బ్యాటింగ్‌తో అడ్డుకట్ట వేశాడు. ఆరంభంలో ధనాధన్ షాట్లతో రెచ్చిపోయన రవీంద్ర (27).. గైక్వాడ్‌తో తొలి వికెట్‌కు 32 రన్స్ జోడించి ఔటయ్యాడు. ఇంపాక్ట్‌గా వచ్చిన డారిల్ మిచెల్ (22) కూడా భారీ షాట్లతో స్కోరు కొట్టడంతో పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసిన చెన్నై ఎనిమిదో ఓవర్ నుంచి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఈ ఓవర్‌లో చహల్ (1/22) దెబ్బకు మిచెల్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 35 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
మొయిన్ అలీ (10), శివం దూబే (18) ఉన్నంతసేపు వేగంగా ఆడి ఔట్‌కాగా, 16వ ఓవర్‌లో జడేజా (5) అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్‌గా వెనుదిరగడంతో సీఎస్కే 107/4తో కష్టాల్లో పడింది. అయితే ఓ ఎండ్‌లో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన రుతురాజ్‌కు చివర్లో సమీర్ రిజ్వి (15 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 24 రన్స్ జత చేసి టీమ్‌ను గెలిపించారు.
ఫ్యాన్స్‌కు థ్యాంక్స్
ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో చెన్నై చివరి లీగ్ మ్యాచ్‌కు ఫ్యాన్స్ పోటెత్తారు. దాంతో స్టేడియం మొత్తం పసుపు వర్ణంగా మారింది. ఆట ముగిసిన తర్వాత చెన్నై ఆటగాళ్లంతా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. ధోనీ టెన్నిస్ రాకెట్‌తో ఎల్లో బాల్స్‌ను ఫ్యాన్స్‌కు అందించాడు.. కాగా, ఈ సీజన్ క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లు చెపాక్‌లోనే షెడ్యూల్ చేశారు. చెన్నై ప్లేఆఫ్స్ చేరితే మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఉంది.
ఒకే వేదికపై (చెపాక్) 50 విజయాలు సాధించిన మూడో టీమ్ సీఎస్కే. కోల్‌కతా (52, ఈడెన్), ముంబై (52, వాంఖడే) ముందున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్ : 20 ఓవర్లలో 141/5 (రియాన్ పరాగ్ 47*, జురెల్ 28, సిమర్‌జీత్ 3/26).
చెన్నై: 18.2 ఓవర్లలో 145/5 (రుతురాజ్ 42*, రచిన్ 27, అశ్విన్ 2/35).