MI vs CSK: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన జడేజా, దూబే.. ముంబై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

MI vs CSK: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన జడేజా, దూబే.. ముంబై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

వాంఖడే వేదికగా వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో రాణించింది. స్టార్ ప్లేయర్లు జడేజా(35 బంతుల్లో 53:4 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబే(32 బంతుల్లో 50:2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేయడంతో ముంబై ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 53 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు.. సాంట్నర్, అశ్వని కుమార్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నైకు మంచి ఆరంభం లభించలేదు. పేలవ ఫామ్ లో ఉన్న రచీన్ రవీంద్ర 5 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ దశలో జట్టును ఇద్దరు కుర్రాళ్ళు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రషీద్ (19), ఆయుష్ మాత్రే (32) ఇద్దరూ పవర్ ప్లే లో అద్భుతంగా ఆడుతూ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా మాత్రే ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లే లో 48 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. 

పవర్ ప్లే తర్వాత ఏడో ఓవర్లో మాత్రే, ఎనిమిదో ఓవర్లో రషీద్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో సూపర్ కింగ్స్ 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజా, దూబే జట్టును ఆదుకున్నారు. ప్రారంభంలో ఆచితూచి ఆడినా క్రమంగా బ్యాట్ ఝులిపించారు. నాలుగో వికెట్ కు 79 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. దూబే ఔటైనా చివరి వరకు క్రీజ్ లో ఉన్న జడేజా జట్టును స్కోర్ ను 170 పరుగుల మార్క్ దాటించాడు.