CSK vs MI: ముంబైని తిప్పేసిన రూ.10 కోట్ల బౌలర్.. చెన్నై ముందు మోస్తరు లక్ష్యం

CSK vs MI: ముంబైని తిప్పేసిన రూ.10 కోట్ల బౌలర్.. చెన్నై ముందు మోస్తరు లక్ష్యం

చెన్నైలోని చెపాక్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో సత్తా చాటింది. ప్రత్యర్థి ముంబైని ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేసింది. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ ఇచ్చిన శుభారంభంతో మిడిల్ ఓవర్స్ లో నూర్ ఆహ్మద్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. నూర్ అహ్మద్ తో పాటు బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ప్రత్యర్థి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ టాప్ స్కోరర్. 

ALSO READ | CSK vs MI: బ్లాక్ బస్టర్ సమరం: ముంబైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ లోనే రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఇదే ఊపులో ఖలీల్.. రికెల్టాన్(13)ను పెవిలియన్ కు చేర్చాడు. పవర్ ప్లే లో అశ్విన్ ను తీసుకు రావడం చెన్నైకి కలిసి వచ్చింది. అతను తన తొలి ఓవర్ లోనే జాక్స్ (7) ను ఔట్ చేసాడు. ఈ దశలో ముంబైని సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. సాఫీగా వెళ్తున్న ముంబై ఇన్నింగ్స్ ను నూర్ అహ్మద్ తన స్పిన్ తో కకావికలం చేశాడు. 

స్వల్ప వ్యవధికలో సూర్య(29)తో పాటు తిలక్ వర్మ(31)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లను తీసి ముంబై పతనాన్ని శాసించాడు. చివర్లో దీపక్ చాహర్ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ 150 పరుగుల మార్క్ అందుకుంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహర్ 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా.. అశ్విన్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది.