
- ఐదు ఓటముల తర్వాత మళ్లీ గెలుపు బాట
- 5 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు.. రాణించిన బౌలర్లు, దూబే, ధోనీ
లక్నో: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని డీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఛేజింగ్‌లో శివం దూబే (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్)కు తోడు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (11 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) తన మార్కు ఫినిషింగ్ స్కిల్స్ చూపెట్టడంతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (43 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) ఫిఫ్టీతో ఆకట్టుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది.
మిచెల్ మార్ష్ (30), ఆయుష్ బదోనీ (22) రాణించారు. జడేజా (2/24), పతిరణ (2/45) చెరో రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (0/13) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అనంతరం ఛేజింగ్‌లో చెన్నై 19.3 ఓవర్లలో 168/5 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (22 బాల్స్‌లో 5 ఫోర్లతో 37), షేక్ రషీద్ (19 బాల్స్‌లో 6 ఫోర్లతో 27) కూడా రాణించారు. ధోనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
దూబే, ధోనీ గెలిపించారు
చిన్న టార్గెట్ ఛేజింగ్‌ను చెన్నై మెరుగ్గా ఆరంభించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్... రచిన్ రవీంద్రతో తొలి వికెట్‌కు 52 రన్స్ జోడించి మంచి పునాది వేశాడు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకుంటూ ఓపెనర్లు షాట్లు కొట్టారు. తొలి ఓవర్లోనే రచిన్ రెండు ఫోర్లతో శార్దూల్‌కు స్వాగతం పలకగా.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో రషీద్ మూడు ఫోర్లతో జోరందుకున్నాడు. శార్దూల్ వేసిన మూడో ఓవర్లోనూ పర్‌ఫెక్ట్ షాట్లతో మరో రెండు ఫోర్లు కొట్టాడు.
కానీ ఐదో ఓవర్లో అవేశ్ వేసిన స్లో షార్ట్ లెంగ్త్ బాల్‌కు రషీద్.. పూరన్‌కు చిక్కగా పవర్ ప్లేను సీఎస్కే 59/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత లక్నో బౌలర్లు వరుస వికెట్లతో చెన్నైపై ఒత్తిడి పెంచారు. క్రీజులో కుదురుకున్న రచిన్‌ను మార్‌క్రమ్ ఎల్బీ చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(9)ని బిష్ణోయ్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కుపంపాడు. మార్‌క్రమ్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే ఊపు తెచ్చే ప్రయత్నం చేసినా.. రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9)కూడా ఫెయిలవడంతో 15 ఓవర్లకు 111/5తో చెన్నై కష్టాల్లో పడింది.
ఈ టైమ్‌లో క్రీజులో కుదురుకున్న దూబేకి తోడైన కెప్టెన్ ధోనీ.. అవేశ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో స్టేడియం హోరెత్తింది. చివరి నాలుగు ఓవర్లలో 44 రన్స్ అవసరం అవగా.. శార్దూల్ బౌలింగ్‌లో దూబే ఫోర్, ధోనీ సింగిల్ హ్యాండ్ షాట్ సిక్స్ కొట్టి జట్టును రేసులో నిలిపారు. 18వ ఓవర్లో అవేశ్ ఏడు రన్సే ఇచ్చినా.. శార్దూల్ వేసిన 19వ ఓవర్లో దూబే వరుసగా ఫోర్, సిక్స్... ధోనీ ఫోర్ కొట్టి సీఎస్కే గెలుపు ఖాయం చేశారు. లాస్ట్ ఓవర్లో దూబే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
పంత్ ఫిఫ్టీ
కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి ఫామ్ అందుకున్నా.. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లక్నో ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ (6)ను ఆరో బాల్‌కే ఔట్ చేసిన ఖలీల్ ఔట్ చేయగా.. డేంజర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (8)ను అన్షుల్ నాలుగో ఓవర్లో ఎల్బీ చేసి దెబ్బకొట్టాడు. ఆ ఓవర్లో సిక్స్ కొట్టిన మిచెల్ మార్ష్ ఖలీల్ బౌలింగ్‌లో 4,6తో వేగం పెంచే ప్రయత్నం చేయగా పవర్ ప్లేను లక్నో 42/2తో ముగించింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన పంత్ .. డేరింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. జెమీ ఒవర్టన్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ సిక్స్ కొట్టి కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో పంత్, మార్ష్ చెరో ఫోర్ కొట్టారు. కానీ, తన తర్వాతి ఓవర్లోనే మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన జడ్డూ మూడో వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు.
ఈ దశలో పంత్‌కు తోడైన బదోనీ.. నో బాల్ క్యాచ్, ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. ఒవర్టన్ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కానీ, జడ్డూ బౌలింగ్‌లో క్రీజు ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌట్ అయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ (20) సిక్స్ కొట్టినా.. ఇంకో ఎండ్‌లో స్పిన్నర్ నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి లక్నో స్పీడును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నూర్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన పంత్.. పతిరణ వేసిన 18వ ఓవర్లో హెలికాప్టర్ షాట్, సింగిల్ హ్యాండ్ షాట్ సిక్సర్లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను ఖలీల్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టగా.. సమద్ కూడా ఓ బాల్‌ను స్టాండ్స్‌కు చేర్చాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఈ ఇద్దరితో పాటు శార్దూల్ ఠాకూర్ (6) ఔటవగా.. 11 రన్స్ రావడంతో లక్నో 160 మార్కు అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 166/7 (పంత్ 63, మార్ష్ 30, బదోనీ 22, జడేజా 2/24).
చెన్నై: 19.3 ఓవర్లలో 168/5 ( దూబే 43*, రచిన్ 37, ధోనీ 26*, బిష్ణోయ్ 2/18)
ధోనీ@ 200
ఐపీఎల్‌లో 200 డిస్మిసల్స్ (స్టంపౌట్, క్యాచ్‌లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డుకెక్కాడు.
త్రిపాఠి ఖతర్నాక్ క్యాచ్
లక్నో ఇన్నింగ్స్ ఆరో బాల్‌కు మార్‌క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ను చెన్నై ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి అద్భుతంగా అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఖలీల్ బాల్‌ను మార్‌క్రమ్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకొని అది పాయింట్ మీదుగా గాల్లోకి లేచింది. తన తల మీదుగా వెళ్తున్న బాల్‌ను త్రిపాఠి సూపర్ ఫాస్ట్‌గా ముందుకు రన్నింగ్ చేస్తూ అందుకున్న తీరు1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ దేవ్ పట్టిన క్లాసిక్ క్యాచ్‌ను గుర్తుకు తెచ్చింది.