కీలకమైన మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. సొంత గడ్డపై చెలరేగలేకపోయారు. గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టుకు యావరేజ్ టార్గెట్ విధించారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేశారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (60), డివాన్ కాన్వే (40) తప్ప మిగతా వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, కాన్వే మంచి పాట్నర్ షిప్ ను అందించారు. తొలి వికెట్ కు 10.3 ఓవర్లలో 87 పరుగులు జత చేశారు. ఇదే క్రమంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లతో 60 పరుగులు సాధించాడు. అయితే సూపర్ బ్యాటింగ్ తో దూసుకుపోతున్న రుతురాజ్ ను మోహిత్ శర్మ ఔట్ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దుబే (1)ను నూర్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో కాన్వే, రహానే కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. మూడో వికెట్ కు 31 పరుగులు జతచేశారు. అయితే 17 పరుగులు చేసిన రహానే దర్శన్ నక్ఖండే బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాన్వే(40) ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 125కే 4 వికెట్లు కోల్పోయింది.
వరుసగా వికెట్లు..
ఆ తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. 17 పరుగులు చేసి అంబటి రాయుడు, 1 పరుగే చేసి ధోని పెవీలియన్ చేరారు. ఓ వైపు వికెట్లు పడినా జడేజా కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. 16 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. ఇతనికి మోయిన్ అలీ (9) సహకరించడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నల్ఖండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.