- గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
- రెండో టైటిల్‌పై జీటీ గురి
- ఐదో ట్రోఫీపై కన్నేసిన ధోనీసేన
- మహీ కెప్టెన్సీ.. గిల్ బ్యాటింగ్‌పై ఫోకస్.
అహ్మదాబాద్: సమ్మర్ హీట్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు మస్తు కిక్కిస్తున్న ఐపీఎల్16వ సీజన్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. హోరాహోరీ లీగ్‌లో మిగతా ఎనిమిది జట్లను వెనక్కునెట్టి ఫైనల్‌కు దూసుకొచ్చిన డిఫెండింగ్ చాంప్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీకి రెడీ అయ్యాయి. లక్ష పైచిలుకు ఫ్యాన్స్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగే మెగా ఫైనల్లో ఈ రెండు జట్లూ ఢీకొట్టబోతున్నాయి. తన మైండ్‌గేమ్‌తో మ్యాజిక్ చేసే ధోనీ సీఎస్కేకు ఐదో టైటిల్ అందించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మహీకి ఇదే ఫేర్‌వెల్ మ్యాచ్ అవ్వొచ్చు. మరోవైపు ధోనీ నీడలో ఎదిగి ఇప్పుడు లీడర్‌గా మారిన హార్దిక్ పాండ్యా జీటీని వరుసగా రెండోసారి విజేతగా నిలపాలని ఆశిస్తున్నాడు. వీరితో పాటు సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఇండియా ఫ్యూచర్ మెగాస్టార్ శుభ్‌మన్ గిల్ ఫైనల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు వందేసిన గిల్.. అదే జోరు కొనసాగిస్తే ధోనీసేనకు ‘హైఫైవ్’ దక్కడం కష్టమే కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 851 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్న శుభ్‌మన్‌ను అడ్డుకునేందుకు ధోనీ ఎలాంటి ప్లాన్స్ వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
మహీ మ్యాజిక్‌పైనే
ఈ సీజన్‌లో సీఎస్కే, జీటీ తలపడటం ఇది మూడోసారి. తొలిపోరులో టైటాన్స్ నెగ్గగా.. క్వాలిఫయర్1లో గెలిచిన సీఎస్కే లెక్క సరిచేసింది. కానీ, ఆ మ్యాచ్ చెపాక్‌లోని స్లో, స్పిన్ వికెట్‌పై జరిగింది. అహ్మదాబాద్ స్టేడియం పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయి. బాల్ చక్కగా బ్యాట్‌పైకి రావడంతో హైస్కోర్లు నమోదవుతున్నాయి. అది సీఎస్కేకు మైనస్ కానుంది. పైగా ఈ గ్రౌండ్‌లో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ టీమ్ ఓడింది. ఐపీఎల్‌లో సీఎస్కే కనీసం మూడు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించని ఏకైక గ్రౌండ్ ఇదే. ఇలా చెన్నైకి చాలా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. కానీ, వీటన్నింటినీ దాటుకొని ముందుకెళ్లే మాస్టర్‌మైండ్ మహీ సొంతం. తుషార్, పతిరణ, తీక్షణ, శివం దూబే, గైక్వాడ్ వంటి యంగ్‌స్టర్స్ నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబడుతూ టీమ్‌ను ఇంతదూరం తీసుకొచ్చిన ధోనీ.. క్వాలిఫయర్1లో చేసిన మ్యాజిక్ రిపీట్ చేయాలని అంతా ఆశిస్తున్నారు. ఓపెనర్ కాన్వే, పేసర్ దీపక్ చహర్, ఆల్‌రౌండర్లు జడేజా, మొయిన్ అలీ కూడా తలో చేయి వేస్తే... ఫినిషర్‌గా ధోనీ సైతం బ్యాట్ ఝుళిపిస్తే సీఎస్కే ఐదో టైటిల్ కొట్టడం సులభం అవుతుంది. మహీకి ఇది 11వ ఐపీఎల్ ఫైనల్. చెన్నై తరఫున పదోది. మరే ప్లేయర్ ఇన్ని ఫైనల్స్ ఆడలేదు. మరి, అహ్మదాబాద్‌లో తొలి గెలుపుతో ధోనీ టైటిళ్ల ‘హైఫైవ్’ కొడతాడో లేదో చూడాలి.
జోష్‌లో జీటీ
క్వాలిఫయర్1లో సీఎస్కే చేతిలో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో ముంబైని చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన జీటీ ఇప్పుడు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. పైగా హోమ్‌గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో జీటీ ఆరింటిలో గెలిచింది. క్వాలిఫయర్2లో ముంబైపై భారీ విజయం ఆ టీమ్ కాన్ఫిడెన్స్‌ను అమాంతం పెంచింది. అందుకు ముఖ్య కారణం శుభ్‌మన్ గిల్. కొన్నాళ్లుగా కలల ఫామ్‌లో ఉన్న గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫైనల్లోనూ అతను జీటీకి అత్యంత కీలకం కానున్నాడు. అయితే హార్దిక్‌సేన తనొక్కడిపైనే ఆధారపడటం లేదు. సాహా, సాయి సుదర్శన్, పాండ్యా, విజయ్ శంకర్, మిల్లర్, రషీద్, రాహుల్ తెవాటియా వరకూ అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఆ టీమ్ సొంతం. బౌలింగ్‌లోనూ జీటీ దుర్భేధ్యంగా ఉంది. సీజన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ షమీతో పాటు స్పిన్నర్లు రషీద్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కీలకంగా ఉన్నారు. పవర్‌ప్లేలో షమీ.. మధ్యలో స్పిన్నర్లతో పాటు పేసర్ జోష్ లిటిల్, డెత్ ఓవర్లలో మోహిత్ శర్మ అదరగొడుతున్నారు. ఇలా జీటీ కంప్లీట్ టీమ్‌గా మారింది. ధోనీని ఆరాధించే హార్దిక్ అతని మాదిరిగా ప్రశాంతంగా ఉంటూ టీమ్‌ను గొప్పగా నడిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఐదు ఫైనల్స్ ఆడిన అనుభవం అతని సొంతం. గత సీజన్ విక్టరీ తర్వాత ఇండియా టీ20 పగ్గాలు అందుకున్న హార్దిక్ మరో టైటిల్ నెగ్గితే ఫుల్ టైమ్ లీడర్‌గా మారే చాన్సుంది. ధోనీ నుంచి ఆటతో పాటు జీవిత పాఠాలు సైతం నేర్చుకున్నానని చెప్పే పాండ్యా.. ఆదివారం తన లైఫ్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నాడు. గురువుపై అతను పైచేయి సాధిస్తాడేమో చూడాలి.
పిచ్/వాతావరణం
ఈ సీజన్‌లో హైస్కోరింగ్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ వేదికగా మారింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 193గా ఉంది. అందులో ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. దాంతో, ఫైనల్లో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. ఇక, ఆదివారం వాతావరణం మేఘావృతమై ఉండనుంది. భారీ వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం వచ్చినా ఫైనల్‌కు రిజర్వ్ డే (సోమవారం) ఉంది.