రైజర్స్ రేసులోనే .. ఏడో ఓటమితో సీఎస్కే ఖేల్‌‌‌‌ఖతం!

రైజర్స్ రేసులోనే .. ఏడో ఓటమితో సీఎస్కే ఖేల్‌‌‌‌ఖతం!

 

  • చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
  • రాణించిన హర్షల్‌‌‌‌, ఇషాన్‌‌‌‌, కమిందు.. ఏడో ఓటమితో సీఎస్కే ఖేల్‌‌‌‌ఖతం!

చెన్నై: పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచిన రెండు జట్ల మధ్య పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌దే పైచేయి అయింది. ప్లే ఆఫ్స్‌‌‌‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో సీఎస్కేకు చెక్ పెట్టిన సన్ రైజర్స్‌‌‌‌ తిరిగి విజయాల బాట పట్టింది. పేసర్ హర్షల్ పటేల్ (4/28), కమిందు మెండిస్ (1/26;  22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లతో 32 నాటౌట్‌‌‌‌) రాణించడంతో చెపాక్ స్టేడియంలో సీఎస్కేపై సన్ రైజర్స్‌‌ తొలిసారి విజయం అందుకుంది.  శుక్రవారం రాత్రి జరిగిన లో స్కోరింగ్  మ్యాచ్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. సొంతగడ్డపై  వరుసగా నాలుగు.. మొత్తంగా ఏడో ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్‌‌‌‌ అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రేవిస్ (25 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 42), ఆయుష్ మాత్రమే (19 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 30) పోరాడారు. రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్‌‌‌‌, ఉనాద్కట్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ 18.4  ఓవర్లలో  155/5 స్కోరు చేసి గెలిచింది. ఇషాన్ కిషన్ (34 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 44) రాణించాడు. హర్షల్​కు  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

చెన్నై తడబాటు..

టాస్ నెగ్గి బౌలింగ్‌‌‌‌ ఎంచుకున్న సన్ రైజర్స్‌‌‌‌ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌‌‌‌కే ఓపెనర్ షేక్ రషీద్ (0) వికెట్ తీసిన షమీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే వరుస బౌండ్రీలు కొట్టినా.. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చి క్రీజులో ఇబ్బంది పడిన సామ్ కరన్ (9)ను ఐదో ఓవర్లో హర్షల్‌‌‌‌ వెనక్కుపంపాడు. వెంటనే ఆయుష్‌‌‌‌ను కమిన్స్ ఔట్‌‌‌‌ చేయడంతో పవర్ ప్లేను చెన్నై 50/3 స్కోరుతో ముగించింది. ఈ దశలో జడేజా (21), డెవాల్డ్ బ్రేవిస్ స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.  కానీ, పదో ఓవర్లో జడ్డూను బౌల్డ్ చేసిన కమిందు చెన్నైకి షాకిచ్చాడు. ఈ టైమ్‌‌‌‌లో క్రీజులోకి వచ్చిన శివం దూబే (12) షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. కమిందు బౌలింగ్‌‌‌‌లో బ్రేవిస్ మూడు సిక్సర్లతో విజృంభించడంతో  12 ఓవర్లకు స్కోరు వంద దాటింది. హర్షల్ వేసిన తర్వాతి ఓవర్లో బ్రేవిస్‌‌‌‌ వెనుదిరగడంతో సీఎస్కే జోరుకు బ్రేక్ పడింది. ఆపై, దూబేను ఉనాద్కట్‌‌‌‌ పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా (22 ) పోరాడినా.. ఎంఎస్ ధోనీ (10 బాల్స్‌‌‌‌లో 6)తో పాటు అన్షుల్ కాంబోజ్ (2),  నూర్ అహ్మద్ (2) కూడా ఫెయిలవడంతో  చెన్నై కష్టంగా 150  మార్కు దాటింది.

గెలిపించిన ఇషాన్‌‌‌‌, కమిందు

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో సన్ రైజర్స్ కూడా తడబడినా.. ఇషాన్ కిషన్‌‌‌‌, కమిందు మెండిస్ ఆదుకోవడంతో గట్టెక్కింది. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ రెండో బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్ శర్మ (0) ఔటయ్యాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన ఇషాన్ జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయగా.. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ట్రావిస్ హెడ్ (19) కూడా ఎక్కువసేపు నిలువలేదు. నాలుగు ఫోర్లు కొట్టిన అతను అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌‌‌‌లో బౌల్డ్ అవ్వడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను సన్ రైజర్స్ 37/2తో ముగించింది.  గత మ్యాచ్‌‌‌‌లో అదరగొట్టిన క్లాసెన్ (7) ఈసారి ఫెయిలయ్యాడు. జడేజా బౌలింగ్‌‌‌‌లో హుడాకు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. కరన్ బౌలింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌, అనికేత్ వర్మ (19 ) సిక్స్ కొట్టడంతో సగం ఓవర్లకు రైజర్స్ 69/3 స్కోరు మాత్రమే చేసింది. జడ్డూ బౌలింగ్‌‌‌‌లో అనికేత్ మరో సిక్స్ కొట్టగా.. నూర్ అహ్మద్ ఓవర్లో ఇషాన్ కూడా ఓ బాల్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌కు పంపడంతో హైదరాబాద్ పుంజుకుంది. కానీ, తర్వాతి బాల్‌‌‌‌కే ఇషాన్ ఔటవగా.. నూర్ బౌలింగ్‌‌‌‌లోనేఅనికేత్ కూడా వెనుదిరగడంతో చెన్నై మళ్లీ రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. 14 ఓవర్లకు106/5తో నిలిచిన సన్ రైజర్స్‌‌‌‌ను గెలిపించే బాధ్యతను మెండిస్‌‌‌‌, తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి (19 నాటౌట్‌‌) తీసుకున్నారు. ఇద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో 8 బాల్స్ మిగిలుండగానే రైజర్స్ విజయాన్ని అందుకుంది.

కమిందు కమాల్

సన్ రైజర్స్ స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ కమిందు మెండిస్ మరోసారి  రెండు చేతులతో బౌలింగ్‌‌‌‌ చేసి ఆకట్టుకున్నాడు. రైట్ హ్యాండర్లకు ఎడమ చేత్తో.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి  చేత్తో బౌలింగ్ చేశాడు. కుడి చేత్తో ఆఫ్​ బ్రేక్ బౌలింగ్ చేసి జడేజా వికెట్ పడగొట్టిన అతను ఫీల్డింగ్‌‌‌‌లోనూ ఔరా అనిపించాడు. జోరు మీదున్న బ్రేవిస్ హర్షల్ బౌలింగ్‌‌‌‌లో ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను లాంగాఫ్​లో  ఎడమవైపు అమాంతం గాల్లోకి దూకుతూ అందుకున్నాడు. ఈ సీజన్‌‌‌‌లో బెస్ట్ క్యాచ్‌‌‌‌ల్లో  ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.