CSK vs SRH: కాటేరమ్మ కొడుకుల బౌలింగ్తో చెన్నైకి వణుకు.. అయినా సరే 150 దాటిన చెన్నై స్కోర్.. టార్గెట్ ఎంతంటే..

CSK vs SRH: కాటేరమ్మ కొడుకుల బౌలింగ్తో చెన్నైకి వణుకు.. అయినా సరే 150 దాటిన చెన్నై స్కోర్.. టార్గెట్ ఎంతంటే..

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రాణించారు. చెన్నైను 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ చేశారు. 155 పరుగుల లక్ష్యంతో SRH బ్యాటింగ్కు దిగనుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న కాటేరమ్మ కొడుకులు భీకర బౌలింగ్తో చెన్నైకి వణుకు పుట్టించారు. షమీ బౌలింగ్ లో తొలి బంతికే చెన్నై ఓపెనర్ షేక్ రషీద్ స్లిప్లో అభిషేక్ శర్మకు క్యాచ్గా దొరికిపోయి వెనుదిరిగాడు. ఆ తర్వాత 39 పరుగుల దగ్గర శామ్ కరన్ వికెట్ కోల్పోయిన చెన్నై 47 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది.

ఆయుష్ మాత్రే 6 ఫోర్లతో 19 బంతుల్లోనే 30 పరుగుల చేసి దూకుడుగా ఆడాడు. కమ్మిన్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. బ్రెవిస్ 4 సిక్స్లు, ఒక ఫోర్ తో పాతిక బంతుల్లోనే 42 పరుగులతో సన్ రైజర్స్ బౌలర్లను కంగారుపెట్టేశాడు. అయితే.. బ్రెవిస్ స్పీడ్ కు SRH బౌలర్ హర్షల్ పటేల్ అడ్డుకట్ట వేశాడు.

హర్షల్ పటేల్ బౌలింగ్లో షాట్ కోసం యత్నించి బ్రెవిస్ కొట్టిన బంతిని కమిందు మెండిస్ అందరూ అవాక్కయ్యేలా క్యాచ్ పట్టాడు. దీంతో.. బ్రెవిస్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్కు వెళ్లిపోయాడు. శామ్ కరన్ 9 పరుగులు, శివం దూబే 12 పరుగులు, దీపక్ హుడా 22 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ పూర్తిగా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయి వెళ్లిపోయాడు.

అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ 2 పరుగులు, ఖలీల్ అహ్మద్ (నాటౌట్) ఒక పరుగు చేయడంతో చెన్నై జట్టు 154 పరుగులు చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. పాట్ కమ్మిన్స్ (4 ఓవర్లు), జయదేవ్ ఉనద్కట్ (2.5 ఓవర్లు) చెరో 21 పరుగులు ఇచ్చి చెరో రెండు వికెట్లు తీసి రాణించారు. షమీ, కమిందు మెండిస్కు తలో వికెట్ దక్కింది.