ప్లేఆఫ్కు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీపై 77 రన్స్తో విక్టరీ

ప్లేఆఫ్కు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీపై 77 రన్స్తో  విక్టరీ

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 70 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్ కు చేరుకుంది. 14 మ్యాచుల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించిన ధోనిసేన..ప్లేఆఫ్ లో అడుగుపెట్టింది.   కెప్టెన్ వార్నర్ (86) ఒంటరి పోరాటం చేసినా ..జట్టును గెలిపించలేకోపోయాడు. 

టపాటపా..

224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వద్ద పృథ్వీ షా తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాల్ట్ (3)ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  రోసోను చాహర్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

వార్నర్ ఒంటరి పోరాటం..

ఈ సమయంలో కెప్టెన్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. యశ్ దుల్(13), అక్షర్ పటేల్ (18) తో కలిసి మోస్తరు భాగస్వామ్యాలను నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో యశ్ ధుల్, అక్షర్ పటేల్ ఔటడంతో ఢిల్లీ 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా..వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. ఇదే క్రమంలో 58 బంతుల్లో 5 సిక్సులు, 7 ఫోర్లతో 86 పరుగులు సాధించాడు. అయితే 18ఓవర్లలో ఔటయ్యాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివరకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడిపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు, మహేష్ తీక్షణ, పతిరణ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. తుషార్ దేశ్ పాండే, జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది. 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఎడాపెడా బౌలర్లను బాదారు. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో..ఢిల్లీ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కి 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

హాఫ్ సెంచరీలతో ..

ఇదే క్రమంలో గైక్వాడ్, కాన్వే  ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గైక్వాడ్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేయగా..కాన్వే 52 బంతుల్లో 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 87 పరుగులు సాధించారు. అయితే 141 పరుగుల వద్ద గైక్వాడ్ ను  సకారియా ఔట్ చేశాడు.  ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దుబే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 9 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. జోరుమీదున్న దుబేను ఖలీల్ అహ్మద్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాన్వే (87)ను నోర్ట్జే ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో జడేజా 7 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లు, ధోని (5) పరుగులు చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్ట్జే, సకారియా తలా ఓ వికెట్ పడగొట్టారు.