చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.. పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (44 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60), డేవన్ కాన్వే (34 బాల్స్‌లో 4 ఫోర్లతో 40), జడేజా (16 బాల్స్‌లో 2 ఫోర్లతో 22) చెలరేగడంతో పాటు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్–1లో సీఎస్కే 15 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 172/7 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 157 రన్స్‌కు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), రషీద్ ఖాన్ (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. రుతురాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
ఇద్దరు మాత్రమే..
స్లో పిచ్‌పై సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్, కాన్వేను మినహాయించి మిగతా బ్యాటర్లను జీటీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఫస్ట్ ఓవర్‌లో నో బాల్ కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రుతురాజ్.. రెండో ఓవర్‌లో 6,4తో టచ్‌లోకి వచ్చాడు. కాన్వే స్ట్రయిక్ రొటేట్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య ఎక్కువ బౌండ్రీలు రాలేదు. దీంతో పవర్‌ప్లేలో చెన్నై 49/0 స్కోరు మాత్రమే చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత స్పిన్నర్లు రషీద్ (1/37), నూర్ అహ్మద్ (1/29) కూడా రన్స్ కట్టడి చేశారు. 9వ ఓవర్‌లో రుతురాజ్ రెండు బౌండ్రీలతో 37 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో కాన్వే మరో ఫోర్‌తో ఫస్ట్ టెన్‌లో సీఎస్కే 85/0 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్‌లో మోహిత్ (2/31) దెబ్బకు రుతురాజ్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 87 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. 12వ ఓవర్‌లో శివమ్ దూబే (1) వెనుదిరగడంతో స్కోరు 90/2గా మారింది. మూడు ఓవర్ల తర్వాత రహానె (17), ఆ వెంటనే కాన్వే ఔటయ్యారు. ఈ ఇద్దరు మూడు బాల్స్ తేడాలో పెవిలియన్‌కు చేరడంతో మూడో వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. చివర్లో రాయుడు (17), ధోనీ (1), జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. సిక్స్ కొట్టి రాయుడు, సింగిల్ తీసి ధోనీ ఔటయ్యారు. ఆఖర్లో జడేజా రెండు ఫోర్లు, మొయిన్ అలీ (9 నాటౌట్) ఓ సిక్స్ కొట్టాడు. చివరి మూడు ఓవర్లలో 35 రన్స్ రావడంతో సీఎస్కే ఓ మాదిరి టార్గెట్‌ను నిర్దేశించింది. షమీ 2 వికెట్లు తీశాడు.
గిల్, రషీద్ పోరాడినా..
టార్గెట్ ఛేజింగ్‌లో గుజరాత్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలో గిల్, చివర్లో రషీద్ మెరుగ్గా ఆడినా.. సీఎస్కే పేస్–స్పిన్ కాంబినేషన్‌తో దెబ్బకొట్టింది. రెండు ఫోర్లతో సాహా (12) దూకుడు చూపెట్టినా మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. గిల్ 6, 4తో కుదురుకోగా, వన్‌డౌన్‌లో హార్దిక్ పాండ్యా (8) నిరాశపర్చాడు. ఆరో ఓవర్‌లో తీక్షణ (2/28) బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్‌కావడంతో పవర్‌ప్లేలో 41/2 స్కోరుకే పరిమితమైంది. డాసున్ షనక (17) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బాల్‌ను రోప్ దాటించాడు. 10వ ఓవర్‌లో 4, 6తో 13 రన్స్ రాబట్టడంతో స్కోరు 72/2గా మారింది. 11వ ఓవర్‌లో జడేజా (2/18) దెబ్బకు షనక ఔట్‌కావడంతో వికెట్లపతనం మొదలైంది. మూడు బాల్స్ తేడాలో మిల్లర్ (4), గిల్‌తోపాటు 15వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా (3) ఔట్‌కావడంతో 15 ఓవర్లలో జీటీ 102/6 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఇక విజయానికి చివరి 30 బాల్స్‌లో 71 రన్స్ అవసరం కాగా 16వ ఓవర్‌లో రషీద్ 6, 4తో 13 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో విజయ్ శంకర్ (14) 6, రషీద్ 6, 4తో 19 రన్స్ దంచాడు. పతిరణ (2/37) వేసిన18వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో శంకర్, దర్షన్ నల్కండే (0) ఔటయ్యారు. దీంతో విజయసమీకరణం 12 బాల్స్‌లో 34 రన్స్ గా మారింది. ఈ దశలో రషీద్ ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో 27 రన్స్‌ను రాబట్టడంలో నూర్ అహ్మద్ (7 నాటౌట్), షమీ (5) విఫలమయ్యారు.