CSK vs MI: అదరగొట్టిన రచీన్, నూర్ అహ్మద్.. సొంతగ్గడపై ముంబైపై గెలిచి బోణీ కొట్టిన చెన్నై

CSK vs MI: అదరగొట్టిన రచీన్, నూర్ అహ్మద్.. సొంతగ్గడపై ముంబైపై గెలిచి బోణీ కొట్టిన చెన్నై

ఐపీఎల్ 2025 సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. చెన్నై వేదికగా చెపాక్  స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు.. ఓపెనర్ రచీన్ రవీంద్ర( 45 బంతుల్లో 65:2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ గైక్వాడ్ (53) హాఫ్ సెంచరీలతో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లను 158 పరుగులు చేసి గెలిచింది.  

156 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మూడో ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ త్రిపాఠి 2 పరుగులే చేసి చాహర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్, రచీన్ రవీంద్రతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా గైక్వాడ్ ఎడా పెడా బౌండరీలు బాదుతూ  స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 22 బతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో గైక్వాడ్ కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక చెన్నై విజయం నల్లేరు మీద  నడకే అనుకున్న సమయంలో ముంబై బౌలర్లు చెలరేగారు. 

ముఖ్యంగా 24 ఏళ్ళ విఘ్నేష్ పుత్తూరు చెన్నై స్వల్ప వ్యవధిలో గైక్వాడ్(53), దూబే (9), దీపక్ హుడా (3) వికెట్లను పడగొట్టి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. సామ్ కరణ్(4) ను జాక్స్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే ఓపెనర్ రచీన్ రవీంద్ర పట్టుదలగా ఆడి చివరి వరకు క్రీజ్ లో చెన్నైకి విజయాన్ని అందించాడు. మరో ఎండ్ లో అతనికి జడేజా (17)చక్కని సహకారం అందించాడు.  ముంబై బౌలర్లలో  విఘ్నేష్ పుత్తూరు  మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, విల్ జాక్స్ లకు తలో వికెట్ లభించింది.          
           
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ లోనే రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఇదే ఊపులో ఖలీల్.. రికెల్టాన్(13)ను పెవిలియన్ కు చేర్చాడు. పవర్ ప్లే లో అశ్విన్ ను తీసుకు రావడం చెన్నైకి కలిసి వచ్చింది. అతను తన తొలి ఓవర్ లోనే జాక్స్ (7) ను ఔట్ చేసాడు. ఈ దశలో ముంబైని సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. సాఫీగా వెళ్తున్న ముంబై ఇన్నింగ్స్ ను నూర్ అహ్మద్ తన స్పిన్ తో కకావికలం చేశాడు. 

స్వల్ప వ్యవధికలో సూర్య(29)తో పాటు తిలక్ వర్మ(31)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లను తీసి ముంబై పతనాన్ని శాసించాడు. చివర్లో దీపక్ చాహర్ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ 150 పరుగుల మార్క్ అందుకుంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహర్ 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా.. అశ్విన్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది.