LSG vs CSK: లక్నోపై థ్రిల్లింగ్ విక్టరీ.. ఉత్కంఠ పోరులో చెన్నైను గెలిపించిన ధోనీ

LSG vs CSK: లక్నోపై థ్రిల్లింగ్ విక్టరీ.. ఉత్కంఠ పోరులో చెన్నైను గెలిపించిన ధోనీ

ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. సోమవారం (ఏప్రిల్ 14) ఎకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జయింట్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుస ఓటములకు బ్రేక్ వేసింది. మొదట బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో పాటు ఛేజింగ్ లో ధోనీ (11 బంతుల్లో 26: 4 ఫోర్లు, సిక్సర్) దూబే (43) తడాఖా చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి గెలిచింది.    

167 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు షేక్ రషీద్, రచీన్ రవీంద్ర సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 4.5 ఓవర్లలోనే 52 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మ్యాచ్ లోనే 6 ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన రషీద్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి చెన్నై మరోసారి కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ రచీన్ రవీంద్ర 37 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా.. రాహుల్ త్రిపాఠి (9), జడేజా(7), విజయ్ శంకర్ (9) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 

చెన్నై ఒకదశలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న చెన్నై 37 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులతో కష్టాల్లో పడింది. ఒకదశలో శివమ్ దూబే పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా.. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన ధోనీ రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ పై ఆసక్తిని పెంచాడు. చివర్లో ధోనీ, దూబే ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్ గెలిపించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మార్కరం, దిగ్వేశ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.       

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (49 బంతుల్లో 63: 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు.. మార్ష్ (30), సమద్ (20) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగుల ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. 63 పరుగులు చేసి పంత్ టాప్ స్కోరర్ గా  నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతిరానా, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, కంబోజ్ లకు చెరో వికెట్ దక్కింది.