
హిందీ భాష విషయంలో కేంద్రప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలులో హిందీయేరత రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తుండగా.. స్టాలిన్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎన్‌ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని తమిళనాడు సీఎం ఆరోపిస్తున్నారు.
ఇంత పెద్ద వివాదం నడుస్తున్న వేళ తమిళనాడులో ఓ టీచర్.. హిందీలో పద్యం చెప్పలేదని మూడేళ్ల పిల్లాడిని చితకబాదిన ఘటన వెలుగు చూసింది. చెన్నైలోని కిల్పాక్‌లోని భవన్ రాజాజీ విద్యాశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లాడు ఇంటికెళ్లాక స్కూల్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఈ ఘటన కొత్త మలుపు తీసుకుంది.
జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలతో కలిసి తల్లిదండ్రులు.. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దాంతో, ఆమెను సస్పెండ్ చేశారు. హిందీ పద్యం చెప్పడంలో విఫలమైనందుకు తమ బిడ్డను కొట్టడమే కాకుండా.. స్కూలుకు రాకుండా ఇంటి దగ్గరే ఆడుకోమని ఉపాధ్యాయురాయులు ఉచిత సలహా ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
"హిందీ పద్యం చెప్పనందుకు టీచర్ విద్యార్థినిని శిక్షించినట్లు పాఠశాల యాజమాన్యం దృష్టికి వచ్చింది. విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు.." అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ ఎం. పళనిసామి అన్నారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి త్వరలో నివేదిక విడుదల చేస్తామని తెలిపారు.