
చెన్నై సిటీకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ.. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. అంతే కాకుండా చాలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు. అతను పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది.. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ.. ఇప్పుడు భార్య బాధితుడు అయ్యాడు. భార్య నుంచి విడాకుల విషయంలో తలెత్తిన వివాదంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ కేసులో చెన్నై సిటీ పోలీసుల తీరుపై ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు.. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య, కుమారుడు అమెరికా పౌరులుగా ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే భరణం కింద నెలకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ చేసింది భార్య దివ్య. దీనిపై చర్చలు నడుస్తున్నాయి.
Also Read:-నాగ్‌పూర్ హింసాకాండ: కీలక నిందితుడి ఇల్లు కూల్చివేత..
విడాకులకు దారి తీసిన పరిస్థితులను తన ఎక్స్ వేదికగా వెల్లడించాడు ప్రసన్న శంకర్ నారాయణ. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని.. దీనిపై గొడవలు జరిగాయని వెల్లడించాడాయన. ఈ క్రమంలోనే తన భార్య దివ్య.. తన కొడుకును కిడ్నాప్ చేసినట్లు అమెరికాలో కేసు పెట్టిందని.. ఇది అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించినది అంటూ కంప్లయింట్ చేసింది. ఈ విషయంపై విచారణ చేసిన అమెరికా పోలీసులు, అమెరికా కోర్టు.. భర్త ప్రసన్న శంకర్ నారాయణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కంప్లయింట్ అనేది నిరాధారంగా ఉందని తేల్చింది. ఆ తర్వాత సింగపూర్ లోనూ భార్య దివ్య పోలీస్ కంప్లయింట్ చేసిందని.. తనను కొట్టాడని.. అత్యాచారం చేశాడని భార్య దివ్య కంప్లయింట్ చేయగా.. విచారణ చేసిన సింగపూర్ పోలీసులు.. భర్త ప్రసన్న శంకర్ నారాయణకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఈ కేసుల వ్యవహారం.. విచారణ జరుగుతున్న సమయంలోనే అమెరికా కోర్టు ఓ వెసలుబాటు ఇచ్చింది. ప్రతి వారం వీకెండ్ రోజున కొడుకుతో ఉండేందుకు శంకర్ నారాయణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే వారం క్రితం అమెరికా నుంచి కుమారుడితో చెన్నై వచ్చింది భార్య దివ్య. అమెరికా కోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ అయిన శంకర్ నారాయణ స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకెళ్లాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న భార్య దివ్య.. తన కుమారుడిని కిడ్నాప్ చేశాడంటూ భర్త శంకర్ నారాయణపై చెన్నైలో పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది.
ఈ విషయం తెలిసిన శంకర్ నారాయణ.. కుమారుడు తన దగ్గర హ్యాపీగా ఉన్నాడని.. ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. భార్య దివ్య కంప్లయింట్ పై FIR నమోదు చేయని చెన్నై పోలీసులు.. శంకర్ నారాయణను డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 25 లక్షల రూపాయలను పోలీసులు డిమాండ్ చేశారంటూ శంకర్ నారాయణ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో పోలీసులు సైతం ఈ విషయంలో ఇరుక్కున్నారు.
అమెరికా, సింగపూర్ ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, కోర్టు తీర్పులతో శంకర్ నారాయణ సోషల్ మీడియా వేదికగా తన వెర్షన్ చెబుతూ విరుచుకుపడుతున్నాడు. దీంతో చెన్నై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భార్య దివ్య, కుమారుడు అమెరికా పౌరులు కావటంతో ఆచితూచి స్పందిస్తున్నారు. మరోవైపు శంకర్ నారాయణ ప్రధాని మోదీకి సైతం ట్యాగ్ చేసి తన వెర్షన్ విపిస్తున్నాడు.
HR టెక్ స్టార్టప్ రిప్లింగ్ సహా వ్యవస్థాపకుడు, స్టార్టప్ పెట్టుబడిదారుడు.. లక్ష కోట్ల విలువైన కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు కావటంతో ఇప్పుడు ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. శంకర్ నారాయణ చెబుతున్నది నిజమా లేక భార్య దివ్య చెబుతున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది.. ఎవరి వెర్షన్ వాళ్లు వినిపిస్తూ.. విషయాన్ని రచ్చకెక్కించారు.