ఇది నిజం అంట : 25 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరు

ఇది నిజం అంట : 25 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరు

చెన్నై , బెంగుళూరు మధ్య  350 కిలో మీటర్ల దూరం. కారు లేదా బస్సులో ప్రయాణిస్తే..7 గంటల 21 నిమిషాలు పడుతుంది. అదే ట్రైన్ లో ప్రయాణిస్తే 5 గంటలు పడుతుంది. కానీ త్వరలో చెన్నై నుంచి బెంగుళూరుకు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అవును..ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే..

మద్రాస్‌ ఐఐటీలోని ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం విద్యార్థులు హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ఈ ఏడాది మార్చిలో  ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం రూ.8.50 కోట్ల నిధులు కూడా అందజేసింది. హైపర్‌ లూప్‌ ద్వారా 2025లో సరుకుల రవాణా, 2030లో ప్రయాణికుల రైళ్లు నడిపేలా మద్రాస్‌ ఐఐటీ విద్యార్థులు  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా  చెన్నై - బెంగుళూరు మధ్య హైపర్‌లూప్‌ పథకం అమలు సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ఒక ప్రోటోటైప్ హైపర్ లూప్  పాడ్ ను రూపొందించారు. ఆవిష్కార్ హైపర్ లూప్గా పిలవబడే ఈ హైపర్ లూప్ పాడ్ స్పెస్ ఎక్స్ అంతర్జాతీయ హైపర్ లూప్ పాడ్ పోటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు ఈ పోటీల్లో ఆవిష్కార్ హైపర్ లూప్ పాడ్ ఫైనల్స్కు చేరుకుంది. 
 

హైపర్‌ ల్యూప్‌ ఎలా పనిచేస్తుందంటే

హైపర్‌లూప్‌ను భవిష్యత్తు రవాణాగా భారత రైల్వే  అభివర్ణిస్తోంది.  హైపర్‌లూప్ రైలు వేగం..విమాన వేగంతో సమానం.  అయితే ఈ హైపర్ లూప్ అధిక శబ్దాన్ని, వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇందుకోసం విస్తృతమైన మౌలిక సదుపాయాలు అవసరం. హైపర్ లూప్ వాక్యూమ్‌ ట్యూబ్‌ లోపల క్యాప్సూల్‌ ద్వారా హైపర్ లూప్ ట్రైన్ ప్రయాణిస్తుంది. హైపర్‌లూప్‌ అనేది అయస్కాంత తరంగాలను ఉపయోగించి ఈ క్యాప్సూల్‌ను కదిలించే సాంకేతికత. రైల్వే బ్రిడ్జీల్లానే ఈ హైపర్‌ లూప్‌ వ్యవస్థ కోసం ప్రత్యేక స్తంభాలు, వాటిపై పైపులు ఏర్పాటు చేస్తారు. ఆ ట్యూబ్‌ లోపల ప్రయాణానికి క్యాప్సూల్స్‌ ఉంటాయి. ఈ క్యాప్సూల్‌ లోపల ప్రయాణికులు కూర్చుంటారు. క్యాప్సూల్స్‌ను అయస్కాంత తరంగాల ద్వారా కదిలించినప్పుడు, క్యాప్సూల్‌ ట్రాక్‌పై రైలులాగా ట్యూబ్‌ లోపల ప్రయాణిస్తుంది. 

హైపర్ లూప్  సాంకేతిక ఐఐటీ మద్రాస్ విద్యార్థుల చతురతకు నిదర్శనం అని చెప్పాలి.  IIT మద్రాస్ 400 మీటర్ల పొడవైన టెస్టింగ్ వాక్యూమ్ ట్యూబ్‌ను నిర్మించాలని యోచిస్తోంది. అంతేకాదు హైపర్ లూప్ ట్రైన్ అధ్యయనంలో భాగంగా ప్రపంచ పోటీని నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ కు ప్రముఖ సంస్థల నుండి మద్దతు లభించింది.  భారతీయ రైల్వేలు, టాటా స్టీల్, L&T ఇప్పటికే ప్రాజెక్ట్‌కి నిధులు అందజేశాయి. ఇప్పటికే బెస్ట్ స్కేలబిలిటీకి అవార్డును కైవసం చేసుకున్న ఐఐటీ మద్రాస్ టీమ్  కల.. చెన్నై  బెంగళూరు మధ్య  2035 నాటికి హైపర్‌లూప్‌ను అందుబాటులోకి తేవడం. ఇదే జరిగితే చెన్నై నుంచి బెంగుళూరుకు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు.