కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు.. రైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్ రైళ్లు వచ్చాయి కానీ.. 46 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ రైలు అంటే చాలు.. భారతీయ రైల్వే మొత్తం ఓ ఎమోషనల్ గా ఫీలవుతుంది. రైల్వే చరిత్రలోనే అత్యధిక స్పీడ్ తో తీసుకొచ్చిన మొట్టమొదటి రైలుగా దీనికి పేరుంది.
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో రారాజుగా పిలుస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఉన్న ప్రయార్టీ అంతా ఇంతా కాదు. చెన్నై నుంచి పశ్చిమబెంగాల్ హౌరాకు వెళ్లే ఈ రైలు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు.. నాలుగు రాష్ట్రాలను టచ్ చేస్తూ.. 25 గంటల్లో.. 16 వందల 61 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. ఈ రైలు నిన్నా మొన్నా వేసింది కాదు.. 46 సంవత్సరాలుగా.. నిరంతరాయంగా నడుస్తుంది. కోరమండల్ అంటే.. కోస్తా వాళ్లకు ఠక్కున గుర్తుకొచ్చేది దాని స్పీడ్.. వేగం.
ఉదయం తొమ్మిది గంటల సమయంలో చెన్నైలో స్టార్ట్ అయితే.. 431 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా.. ఆరు గంట్లో విజయవాడ చేరుకుంటుంది. చెన్నైకు 300 కిలోమీటర్ల తర్వాత ఒంగోలులో ఆహారం కోసం, టెక్నికల్ చెకింగ్ కోసం మాత్రమే ఆగుతుంది. టికెట్ ఇష్యూ ఉండదు. కోరమండల్ బయలుదేరింది అంటే.. ఆ లైన్ లో వెళ్లే మిగతా అన్నీ రైళ్లను క్రాసింగ్ లో పడేస్తారు.. హై ప్రయార్టీ కింద కోరమండల్ దూసుకెళుతుంది. కళ్లు మూసి తెరిసే లోపు.. స్టేషన్ దాటిపోతుంది అంటే.. దాని వేగం అలాంటిది మరి. 46 ఏళ్లుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఉన్న అనుబంధం అలాంటిది.
ఇంత అనుబంధం ఉంది కాబట్టే.. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ను.. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో రారాజుగా పిలుస్తారు. చెన్నైలో స్టార్ట్ అయితే ఏపీలో జస్ట్ ఐదు అంటే ఐదు చోట్ల మాత్రమే ఆగుతుంది. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నంలో మాత్రమే ఆగుతుంది. ఒడిశాలో ఏడు చోట్ల, పశ్చిమ బెంగాల్ లో రెండు చోట్ల దీనికి స్టాప్స్ ఉన్నాయి. ఒక్కసారి కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కామంటే.. స్టార్టింగ్, ఎండింగ్ స్టేషన్స్ తీసేస్తే.. 16 వందల 61 కిలోమీటర్ల దూరాన్ని.. 15 స్టాపుల్లో ఆగుతూ.. 25 గంటల్లో రీచ్ అవుతుంది.
46 ఏళ్లుగా నిరంతరాయంగా నడుస్తుంది ఈ కోరమండల్ ఎక్స్ ప్రెస్. ప్రారంభంలో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచే ఈ రైలు సర్వీసు.. తర్వాత డిమాండ్ పెరగటంతో.. ప్రతిరోజూ ఈ సర్వీస్ నడుపుతున్నారు. గతంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదాలకు గురైనా.. ప్రస్తుతం జరిగిన ప్రమాదం మాత్రం అతి పెద్దది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఆ రైలుకు ఇంత భారీ ప్రమాదం ఎప్పుడూ జరగలేదు.. ఇప్పటి వరకు లక్షల మందిని ఎంతో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఇంత పెద్ద ప్రమాదం జరగటంతో.. దాని చరిత్రను.. దాని స్పీడ్ ను గుర్తు చేసుకుంటున్నారు ఆయా ప్రాంతాల ప్రజలు.. రైల్వే శాఖ అధికారులు.