బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తమిళనాడులో భారీ వర్షం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తమిళనాడులో భారీ వర్షం

బెంగళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో తిరువారూర్, తిరుత్తు రైపూండి, ముత్తుపేటై, మైల్దుతురై, వేదారణ్యం దాని పరిసర ప్రాంతాల్లో 2వేలకుపైగా ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.

విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాలు ఇంకా పడే సూచనలు ఉండటంతో తమిళనాడు సర్కారు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు ఒక్కరోజు సెలవు ప్రకటించింది.  

తీవ్ర అల్పపీడనంతో తుపాను 

నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మరనుందని..దాని ప్రభావంతో బుధవారం సాయంత్రం తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)వెల్లడించింది. ఈ తుపానుకు సౌదీ అరేబియా ప్రతిపాదించిన పేరు ఫెంగల్ ను సూచించింది.

ఫెంగల్ తుఫాను ప్రభావంతో  తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్టోబర్ చివరలో వచ్చిన దానా తుపాను తర్వాత ఫెంగల్ తుపాన్ భారత తీరాన్ని ప్రభావితం చేసే రెండవ తుపాన్ అని పేర్కొంది.