- 28 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ చిత్తు
- రాణించిన తుషార్, సిమర్‌జీత్
ధర్మశాల: రవీంద జడేజా (26 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43; 3/20) ఆల్‌రౌండ్ షోతో మెప్పించిన వేళ చిన్న స్కోరును అద్భుతంగా కాపాడుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్17లో ఆరో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకొచ్చింది. ఆదివారం సాయంత్రం ధర్మశాలలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో సీఎస్కే 28 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
తొలుత చెన్నై 167/9 స్కోరు చేసింది. జడేజాతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (21 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), డారిల్ మిచెల్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్, హర్షల్ పటేల్ చెరో మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 139/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ప్రభ్‌సిమ్రన్ (30) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. సిమర్‌జీత్, తుషార్ రెండేసి వికెట్లతో రాణించారు. జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
ఆందుకున్న జడ్డూ
బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే పవర్ ప్లేలో 60/1తో పటిష్ట స్థితిలో నిలిచినా మిడిల్ ఓవర్లలో పంజాబ్ స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేక తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్ అజింక్యా రహానె (9)ను రెండో ఓవర్లోనే పెవిలియన్ చేర్చిన అర్ష్‌దీప్ పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ రుతురాజ్, డారిల్ మిచెల్ రెండో వికెట్‌కు 57 రన్స్ జోడించారు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మిచెల్ 4,6తో వేగం పెంచగా.. హర్‌ప్రీత్ వేసి ఆరో ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4.. మిచెల్ ఫోర్‌తో 19 రన్స్ వచ్చాయి.
కానీ, ఏడో ఓవర్లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ రాకతో చెన్నై జోరుకు బ్రేకులు పడ్డాయి. తన తొలి బాల్‌కే గైక్వాడ్‌ను పెవిలియన్ చేర్చి పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసిన రాహుల్ రెండో బాల్‌కే శివం దూబే (0)ను బౌల్డ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికైన తర్వాత దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అవ్వడం గమనార్హం. తర్వాతి ఓవర్లో మిచెల్‌ను హర్షల్ ఔట్ చేయడంతో సీఎస్కే 69/1 నుంచి 76/4తో నిలిచి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్‌రౌండర్లు జడేజా, మొయిన్ అలీ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
హర్షల్ బౌలింగ్‌లో జడేజా, రబాడ ఓవర్లో అలీ రెండేసి ఫోర్లు కొట్టి స్కోరు 100 దాటించారు. కానీ, క్రీజులో కుదురున్న అలీని కరన్ ఐదో వికెట్‌గా ఔట్ చేయడంతో సీఎస్కే రన్‌రేట్ మళ్లీ మందగించింది. జడేజాకు కాసేపు సపోర్ట్ ఇచ్చిన శాంట్నర్ (11)ను చహర్ పెవిలియన్ చేర్చాడు. అయితే జడేజాకు తోడైన శార్దూల్ ఠాకూర్ (17) కరన్ బౌలింగ్‌లో 4,6.. చహర్ ఓవర్లో 4తో అలరించాడు. జడేజా కూడా సిక్స్ కొట్టడంతో 18 ఓవర్లకు 149/6తో నిలిచిన సీఎస్కే స్కోరు 170 దాటేలా కనిపించింది. కానీ, 19వ ఓవర్లో వరుస బాల్స్‌తో శార్దూల్, ధోనీ (0)ని బౌల్డ్ చేసిన హర్షల్ రెండే రన్స్ ఇచ్చాడు. అర్ష్‌దీప్ వేసిన ఆఖరి ఓవర్లో జడేజా 4, 6 రాబట్టి ఔటవగా స్కోరు 160 దాటింది.
పోటీ ఇవ్వని పంజాబ్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో పంజాబ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత పేసర్ తుషార్ దేశ్ పాండే.. తర్వాత జడేజా, సిమర్‌జీత్ దెబ్బకు పంజాబ్ వరుస వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ ధాటిగానే ఆడినా మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. రెండో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన తుషార్ మూడు బాల్స్ తేడాలో జానీ బెయిర్‌స్టో (7), రిలీ రొసో (0) ఇద్దరినీ బౌల్డ్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. 9 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
గ్లీసన్ వేసిన ఐదో ఓవర్లో శశాంక్ ఫోర్, ప్రభ్‌సిమ్రన్ సిక్స్ కొట్టారు. ఆపై తుషార్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ 6, 4.. శశాంక్ ఫోర్‌తో పవర్ ప్లేలో పంజాబ్ 47/2తో నిలిచింది. అయితే, ఏడో ఓవర్లో శాంట్నర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా షాట్‌కు ట్రై చేసిన శశాంక్.. సిమర్‌జీత్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను జడేజా వెనక్కుపంపగా.. పదో ఓవర్లో సిమర్‌జీత్ షార్ట్ బాల్‌ను వెంటాడిన జితేశ్ శర్మ (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. ఆపై 13వ ఓవర్లో మూడు బాల్స్ తేడాలో కరన్ (7), అషుతోశ్ (3) ఔట్ చేసిన జడేజా చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. సిమర్‌జీత్ బౌలింగ్‌లో 6, 4 కొట్టిన హర్షల్ పటేల్(12) తర్వాతి బాల్‌కే ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. గ్లీసన్ ఓవర్లో 4, 4, 6 తో అలరించిన రాహుల్ చహర్ (16) స్కోరు వంద దాటించి శార్దూల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హర్‌ప్రీత్ (17 నాటౌట్), రబాడ (11 నాటౌట్) ఆఖరి ఓవర్ వరకూ నిలిచినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించారు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 167/9 (జడేజా 43, గైక్వాడ్ 32, రాహుల్ చహర్ 3/23, హర్షల్ పటేల్ 3/24)
పంజాబ్: 20 ఓవర్లలో 139/9 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 30, శశాంక్ 27, జడేజా 3/20, సిమర్‌జీత్ 2/16).