- సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేయాలి
- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ చెన్నయ్య
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్కుమార్అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ కమిటీతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ చెన్నయ్య ఆరోపించారు. మంత్రుల కమిటీని రద్దు చేసి సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ అమలుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎస్సీల అభిప్రాయాన్ని తీసుకోకుండా కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అన్నారు. ప్రభుత్వ కమిటీతో మాల, మాల అనుబంధ కులాలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ఒక్క మాల మంత్రి కూడా లేకుండా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. రెడ్డి, మాదిగ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించడం ఏమిటని నిలదీశారు. కమిటీలో దామోదర్ రాజనర్సింహ ఉంటే మాలలకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో సమితి కో కన్వనర్లు బూర్గుల వెంకటేశ్వర్లు, కరణం కిషన్, బత్తుల రాంప్రసాద్, గోపోజు రమేశ్, బేరా బాలకృష్ణ, జంగా శ్రీనివాస్, ఆవుల సుధీర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల కమిటీని రద్దు చేయాలి
ముషీరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని ఉప సంహరించుకోవాలని తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్ డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉత్తమ్ కమిటీలో మాల మంత్రి ఎందుకు లేడని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన చిక్కడపల్లిలో మాట్లాడారు. ఏకపక్షంగా ఉన్న కమిటీతో 50 లక్షల మంది మాల, మాల ఉప కులాలకు ఏమాత్రం న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.