మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: చెన్నూర్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏడీఏ) బాపు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ (ఎంఏఓ) కవిత సస్పెండ్ అయ్యారు. యూరియా ఇండెంట్ కోసం ఫర్టిలైజర్స్ నిర్వాహకుల దగ్గర పైసలు వసూలు చేస్తున్న వైనాన్ని ‘వెలుగు’ పేపర్ బయటపెట్టింది. వ్యవసాయ శాఖలో వసూళ్ల దందాపై జనవరి 22న స్పెషల్ స్టోరీని పబ్లిష్ చేసింది.
దీనిని ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్ సీరియస్ గా పరిగణించారు. కవిత డిప్యుటేషన్ రద్దు చేసి డీఏఓ ఆఫీసులో యథాస్థానానికి పంపించారు. అనంతరం శాఖాపరంగా భీమిని ఏడీఏ ఇంతియాజ్ అహ్మద్ తో విచారణ జరిపించారు. ఈ విచారణ తూతుమంత్రంగా జరగడంతో కలెక్టర్ సంతోష్ జిల్లా పరిషత్ సీఈఓ కె.నరేందర్ తో ఎంక్వయిరీ చేయించారు.
యూరియా సరఫరాలో ఏడీఏ బాపు, ఏఓ కవిత అవకతవకలకు పాల్పడినట్టు సీఈఓ రిపోర్టు సమర్పించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఏడీఏ బాపు, ఏఓ కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. చెన్నూర్ ఇన్చార్జి ఏడీఏగా మందమర్రి ఏఓకు బాధ్యతలు అప్పగించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) కల్పన తెలిపారు.