- స్థలం విలువ రూ.40 లక్షల పైమాటే
- పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్, సెక్రెటరీ
- నాలుగు రోజులవుతున్నా పట్టించుకుంటలేరు
- రెవెన్యూ అధికారులకు బీజేపీ లీడర్ల కంప్లయింట్
చెన్నూర్, వెలుగు: ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీ లీడర్...పైగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు రైట్‌హ్యాండ్..భార్య మున్సిపల్ చైర్పర్సన్..ఇక తనకు ఎదురెవరు అనుకున్నాడో ఏమో... ఏకంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం భూమికే ఎసరు పెట్టాడు. నాలుగు గుంటల స్థలాన్ని కబ్జా చేసి పోల్స్ పాతేశాడు. ఆయనపై సంబంధిత సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్అర్చన గిల్డా భర్త, బీఆర్ఎస్ లీడర్ రాంలాల్ గిల్డా అదే మండలంలోని బావురావుపేట పంచాయతీ పరిధిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం భూమిని కబ్జా చేశాడు. బావురావుపేట శివారులోని సర్వేనంబర్ 3లో ఉన్న చెరువు శిఖంలో ఎకరం భూమిని తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను పంచాయతీకి అప్పగించారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే ఆదేశాల మేరకు డిసెంబర్ 30న భూమిని చదును చేయించారు. ఆ మరునాడు రాంలాల్ గిల్డా క్రీడా ప్రాంగణానికి కేటాయించిన నాలుగు గుంటల స్థలాన్ని పక్కనే ఉన్న భూమిలో కలుపుకుంటూ పోల్స్ పాతాడు. ఎన్‌హెచ్63ని ఆనుకుని ఉండడంతో ఇక్కడ గుంటకు రూ.10 లక్షల పైనే రేటు పలుకుతోంది. కాగా, స్థలాన్ని ఆక్రమంగా స్వాధీనం చేసుకున్న రాంలాల్ గిల్డాపై చర్యలు తీసుకోవాలని బావురావుపేట సర్పంచ్ ఎం.మౌనిక, జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఎ.దివ్య అదే రోజు చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే నాలుగు రోజులవుతున్నా అధికారులు మాత్రం స్పందించలేదు. దీంతో మంగళవారం బీజేపీ లీడర్లు రెవెన్యూ ఆఫీసర్లకు కంప్లయింట్చేశారు. రాంలాల్ గిల్డా కబ్జా చేసిన నాలుగు గుంటల భూమిని పంచాయతీకి స్వాధీనపర్చడంతో పాటు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ గోవిందుకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్‌కుమార్, జనరల్ సెక్రెటరీ చింతల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కొంపెల్లి బానేశ్, కొరుకుప్పల వంశీగౌడ్, అక్షితశర్మ పాల్గొన్నారు.
కబ్జా చేయలే సర్వే చేయించుకోవచ్చు
సర్వేనంబర్ 11లో నాకు 12 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. నా భూమి పక్కనే ఉన్న సర్వే నంబర్ 3లో ప్రభుత్వ భూమి ఉంది. కాబట్టి నాపై ఆరోపణలు చేస్తున్నరు. నేను ఏ భూమిని ఆక్రమించలే. అవసరతమైతే సర్వే చేయించుకోవచ్చు.
- రాంలాల్ గిల్డా
నా దృష్టికి రాలేదు
బావురావుపేట పంచాయతీ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం సర్వేనంబర్ 3లో ఎకరం భూమిని పంచాయతీకి కేటాయించాం. ఆ స్థలం కబ్జాకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. కంప్లయింట్ వస్తే సర్వే చేయిస్తాం.
- శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, తహసీల్దార్