కోల్ బెల్ట్/చెన్నూరు,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తనను కొనాలని చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆరోపించారు. ‘‘బాల్క సుమన్ నాకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిండు. సుమన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే నన్ను కొనాలని చూస్తుండు. 20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా.. నేను వివేక్‌ను విడిచిపెట్టి పోను. నన్ను ఎవరూ కొనలేరు. ఎందుకంటే నేను సుమన్ బానిస కాదు. వివేక్ గెలుపు కోసం ఎంతటి కష్టమైనా భరిస్తా. చెన్నూరు ప్రజలు వివేక్ వెంకటస్వామిని గెలిపించాలి. మీ అభివృద్ధి కోసం వివేక్ కాళ్లయినా పట్టుకుంటా.’’ అని ఓదెలు చెప్పారు. కోటపల్లి మండలంలోని గ్రామాలతోపాటు చెన్నూరులోని వార్డుల్లో వివేక్‌కు స్థానిక మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలిచారు.
ఆయా గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీలు తీశారు. స్థానిక సమస్యలను వివేక్ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. ప్రచారంలో ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, దుర్గం నరేశ్, రామిల్ల రాధిక, మూల సత్యనారాయణరెడ్డి, గొడిసెల బాపురెడ్డి, పోటు చిన్న రాంరెడ్డి, కట్రాల మల్లయ్య, అరె బాపు, కుర్మా రాజమల్లారెడ్డి, మహేశ్‌ప్రసాద్ తివారి, సర్పంచ్ తోట అశోక్, చిర్ల మహేశ్, గట్టు లక్ష్మన్ గౌడ్, నామని లింగయ్య, కుర్మా వెంకటస్వామి గౌడ్, సూరం సందీప్ రెడ్డి,ముల్కల శ్రీనివాస్ రెడ్డి, సూరం మోహన్ రెడ్డి, పొలం రాకేశ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.