బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

రాబోయే బడ్జెట్ లో  ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ (ఫిబ్రవరి 24) మంచిర్యాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వివేక్.. సీఎం రేవంత్ మాట ఇచ్చినట్లుగా నేతకాని కార్పోరేషన్, మాల కార్పోరేషన్ లను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా లిడ్ క్యాప్ కార్పోరేషన్ ను పునరుద్ధరించాలని సీఎం ను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇదివరకే మాట ఇచ్చిందని, అందులో భాగంగా ఇప్పటికే 54 వేల ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. డిఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ.. మళ్ళీ మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 

ALSO READ :కవిత, కేటీఆర్ ఏ పార్టీకి ఓటేస్తారు..? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్

మంచిర్యాల జిల్లా జైపూర్ లో 850 మెగావాట్ల సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నామని, దీంతో మంచిర్యాలలో ఉన్న నిరుద్యోగులకు మరో 5 వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పట్టభద్రులు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని పిలుపునిచ్చారు.