
మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు చెందిన చిత్రకారుడు, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ఏల్పుల పోచం అనే యువకుడు ప్రతిష్టాత్మక ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. తను చేసిన ‘కశ్మీర్ టు కన్యాకుమారి-లైవ్ డ్రాయింగ్స్’కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. హర్యానా లోని ఫరీదాబాల్ లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏల్పుల పోచంను ఘనంగా సత్కరించి, అవార్డును అందించారు.
ఫైన్ ఆర్ట్స్ లో బీఎఫ్ఏ, ఎమ్ఎఫ్ఏ పూర్తి చేసిన పోచం.. 2017లో ‘కశ్మీర్ టు కన్యాకుమారి-లైవ్ డ్రాయింగ్స్’ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. అప్పటి నుంచి 28 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 30 వారసత్వ కట్టడాలు , 10 శక్తి పీఠాలు, 8 జ్యోతిర్లింగాలు, 36 ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలు కాలేజీలు కవర్ చేస్తూ లైవ్ డ్రాయింగ్స్ వేశాడు. ఆర్థిక సమస్యలు, కరోనా పరిస్థితులను తట్టుకుని మొత్తం 2,410 రోజులు దేశం అంతా తిరిగి కళాయాత్ర పూర్తి చేశాడు. ఇండియాలో కళాయాత్ర లైవ్ డ్రాయింగ్స్ చేసిన మొదటి వ్యక్తిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.
పోచం ఇప్పటికే అమెరికాకు చెందిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (USA), లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తదితర ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం సంతోషంగా ఉందని తెలిపాడు.
వ్యవసాయ కూలీ కుటుంబం..
చెన్నూర్ టౌన్‌లోని మారెమ్మవాడకు చెందిన ఏల్పుల పోచంది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు లచ్చక్క, రాజయ్య వ్యవసాయ కూలీలు. పోచం చిన్ననాటి నుంచే కష్టాలను ఎదురీదుతూ చదువుకున్నాడు. పాఠశాల రోజుల్లో డ్రాయింగ్ బాగా వేస్తుండడం గమనించిన టీచర్సత్యనారాయణ, ఆర్టిస్ట్ అయిన కజిన్ బ్రదర్ మద్దూరి రాజన్న ప్రోత్సాహం లభించింది.
2007 బీకామ్ సెకండియర్ చదువుతూనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బీఎఫ్ఏ ఎంట్రెన్స్ రాసి అందులో జాయిన్అయ్యాడు. 2011లో బీఎఫ్ఏ పూర్తికాగానే ఛత్తీగఢ్‌లోని కైరాగఢ్ యూనివర్సిటీలో 2012 నుంచి రెండేంట్లపాటు ఎంఎఫ్ఏ చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్పబ్లిక్ స్కూల్ లో ఆర్ట్ టీచర్‌గా పనిచేశాడు.
2017లో కళాయాత్ర ప్రారంభం
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పోచం.. దీన్ని లైవ్డ్రాయింగ్స్ద్వారా ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో ఈ కళాయాత్ర చేపట్టాడు. 2017 డిసెంబర్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర ప్రారంభించాడు. 2,410 రోజుల్లో 30,700 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోచం యాత్ర సాగింది. 2024 జూన్ 7న కన్యాకుమారిలోని వివేకానంద రాక్దగ్గర యాత్రను ముగించాడు. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.