అవినీతి నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేస్త.. ఎమ్మెల్యే వివేక్ సవాల్

కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అది కుటుంబ పాలన కాదా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ప్రశ్నించారు. తాము ఎల్లప్పుడూ నేరుగా ఎన్నికల్లో పోటీ చేశామని, దొడ్డి దారిన పదవులు పొందలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొప్పుల ఈశ్వర్ ఎన్నడూ కేసీఆర్ ముందు కనీసం కూర్చోలేదని, దళితులను పట్టించుకోలేదన్నారు. నేతకాని సమాజం నుంచి ఎంపీ అయిన బోర్లకుంట వెంకటేశ్ వాళ్ళ కులానికి సైతం ఏమీ చేయలేదన్నారు. తమను తిడితే తమకే ఓట్లే పెరుగుతాయని.. కాకాను విమర్శిస్తే వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తాడన్నారు. 

‘‘నేను నిజంగా దోపిడీ చేసి ఉంటే.. ఈడీ నాపై చర్యలు తీసుకునేది. మా సంస్థల్లో రూపాయి అవినీతి ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించిన ఘనత మా సంస్థలకు ఉంది. మేం ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోలేదు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రజలకు సేవ చేస్తున్నాం. మా కుటుంబం అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా”అని వివేక్ సవాల్ విసిరారు. 

సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి సదానందం యాదవ్, జనరల్ సెక్రటరీ మల్లెత్తుల నరేష్ యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు కొంకటి రవీందర్, పెద్దపల్లి, ధర్మపురి, చెన్నూరు, రామగుండం, మంథని నియోజకవర్గాల లీడర్లు పాల్గొన్నారు.