
వెలుగు, చెన్నూర్: ఇది చెన్నూర్ నడిబొడ్డున ఉన్న కుమ్మరికుంట మినీ ట్యాంక్ బండ్. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచడం కోసం రూ.3 కోట్ల ఖర్చుతో నిర్మించారు. మంత్రి హరీశ్‌రావు చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు. రాత్రివేళల్లో జిగేల్మనే లైట్లను చూసి అటుగా వెళ్తే క్షణం కూడా అక్కడ ఉండలేరు. ఎందుకంటే పట్టణంలోని మురుగునీరంతా కుమ్మరికుంటలోకి చేరి మురికి కూపాన్ని తలపిస్తోంది. చుట్టుపక్కలకు పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతోంది. ఈ చెరువు బస్టాండ్‌కు దగ్గరలో, వ్యాపార సముదాయాల నడుమ ఉండడంతో అటుగా వెళ్లేవారు ముక్కులు మూసుకుంటున్నారు.
ఇక్కడే పేరొందిన పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంది. ప్రతిరోజూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. టెంపుల్‌కు వచ్చే భక్తులు దుర్వాసన తట్టుకోలేక పోతున్నామని అంటున్నారు. మురుగునీరు కలవకుండా డ్రైనేజీలను మళ్లించాలన్న సోయి ఎమ్మెల్యేకు కరువైందని విమర్శిస్తున్నారు. కుమ్మరికుంట చెరువులో మురుగునీళ్లు నిండడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా దోమల బెదడ ఎక్కువైందని, రోగాలబారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
మున్సిపాలిటీల్లో నీళ్ల గోస.. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు అధ్వానం
వెలుగు, మందమర్రి: చెన్నూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, 102 గ్రామపంచాయతీల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మందమర్రి, క్యాతన్‌పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులు నేటికీ పూర్తి కాలేదు. రూరల్‌లో భగీరథ పనులు పూర్తయినా ఎక్కడా చుక్క నీళ్లు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల ఇంటర్నల్ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. పైపులైన్లు తరచూ లీకేజీలు ఏర్పడి వాటర్ సప్లైకి అంతరాయం కలుగుతోంది. మిషన్ భగీరథ స్కీమ్ కాస్త ఎమ్మెల్యే బాల్క సుమన్, కాంట్రాక్టర్లకు మేతగా మారింది. మందమర్రి మున్సిపాలిటీకి కాకా వెంకటస్వామి, ఆయన తనయుడు వివేక్ వెంకటస్వామి హయాంలో నిర్మించిన వాటర్ స్కీమ్లే నేటికీ దిక్కయ్యాయి. ఇప్పటికీ గ్రామాల్లో పంచాయతీ బోర్ల దగ్గర నీళ్ల కోసం మహిళలు బిందెలతో క్యూ కడుతున్న సీన్లు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో తాగునీటి కోసం ఆందోళనలు కామన్ అయ్యాయి.
ఎలక్షన్ స్టంట్లు..
మందమర్రి, క్యాతన్‌పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. మెయిన్‌రోడ్లను వెడల్పు చేసి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి అదే అభివృద్ధిగా బాల్క సుమన్పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మున్సిపల్, టీయూఎఫ్ఐడీసీ, డీఎంఎఫ్ ఫండ్స్‌తో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి నెలలు గడుస్తున్నా పనులు మొదలు కాలేదు. దీంతో ఇది ఎలక్షన్ స్టంట్‌గా ప్రజలు విమర్శిస్తున్నారు.