మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో కుంటలో పడిపోయి చనిపోయిన బాలుడి కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బాసటగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీ.ఎం.డీ బలరాంతో మాట్లాడి ఆ కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రైవేటు ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట ఇచ్చారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల శివారులో తండ్రికి భోజనం తీసుకెళ్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయాడు. అక్టోబర్ 6, 2024న (ఆదివారం) ఈ ఘటన జరిగింది.
టేకుమట్ల గ్రామానికి చెందిన చిప్పకుర్తి రమాదేవి, విష్ణువర్ధన్ గేదెలను మేపుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు రాజ్‌కుమార్ (14) స్థానిక జడ్పీహైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. విష్ణువర్ధన్ రోజు మాదిరిగానే గేదెలను మేపేందుకు గ్రామ శివారులోని సింగరేణి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రి విష్ణువర్ధన్‌కు భోజనం ఇచ్చేందుకు రాజ్‌కుమార్ ఇంటి నుంచి బయలుదేరాడు.
ALSO READ | నీళ్లలో మునిగి ముగ్గురు మృతి
సింగరేణి యాజమాన్యం ట్రాక్ నిర్మాణ టైంలో పక్కనే మట్టి తవ్వకాలు చేపట్టింది. ఆ కుంటపై నడుచుకుంటూ వెళ్తున్న రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయాడు. గమనించిన స్థానికులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసే సరికే చనిపోయాడు. దీంతో సింగరేణి సంస్థ ట్రాక్ పక్కన తీసిన కుంట వల్లే బాలుడు చనిపోయాడంటూ బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలంటూ రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు.