క్వాలిటీ విద్య అందించేందుకు కృషి చేస్తా : వివేక్ వెంకటస్వామి

క్వాలిటీ విద్య అందించేందుకు కృషి చేస్తా : వివేక్ వెంకటస్వామి
  • షౌకత్ ​అలీ స్మారకార్థం లైబ్రరీ భవనం పనులకు శంకుస్థాపన

కోల్​బెల్ట్, వెలుగు: కోల్​బెల్ట్​ ప్రాంతంలో  కేకే విద్యా విహార్ విద్యాసంస్థలను స్థాపించి, 40 ఏండ్ల పాటు విద్యాభివృద్ధికి దివంగత షౌకత్ అలీ ఖాన్ ఎంతో కృషి చేశారని, ఆయన ప్రోత్సాహంతో వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి పట్టణం రామన్​ కాలనీలో షౌకత్ అలీ ఖాన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరరై ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. షౌకత్​అలీ స్మారకార్థం ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ భవన నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. షౌకత్​అలీఖాన్​ క్రమశిక్షణతో కూడిన క్వాలిటీ విద్యను అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పారన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంపై పట్టు సాధించేలా ప్రోత్సహించారని అన్నారు. 

ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా లైబ్రరీ భవనం ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. కాంగ్రెస్​ సర్కార్ ​ప్రతి నియోజకవర్గంలో క్వాలిటీ విద్యను అందించేందుకు రూ.200 కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్​స్కూల్ ​నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు షౌకత్​అలీ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి జిల్లా ట్రస్మా తరఫున రూ.40 వేలు, మందమర్రి తవక్కల్​ స్కూల్​తరఫున రూ.25వేలు, మంచిర్యాల ఉషోదయ స్కూల్​కరస్పాడెంటెంట్​ బాలాజీ రూ.10 వేలు అందజేశారు.

నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించిన ఎమ్మెల్యే

చెన్నూరు పర్యటనలో భాగంగా మందమర్రికి వెళ్తున్న వివేక్ ​వెంకటస్వామి ఆ మార్గంలో వరినాట్లు వేస్తున్న మహిళలతో కొద్దిసేపు  ముచ్చటించారు. భీమారం మండలం మద్దికల్ గ్రామ శివారులో వరి నాట్లు వేస్తున్న మహిళలను కలిశారు. గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకు న్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్​వాక్​సందర్భంగా బట్టిగూడెం కాలనీలోని లక్ష్మీదేవుర ఆలయంలో స్థానిక కాంగ్రెస్​ లీడర్లతో కలిసి పూజలు చేశారు.