
అమ్రాబాద్, వెలుగు: 400 ఏండ్ల చరిత్ర కలిగిన పురాతన రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం రాయలగండి వద్ద అచ్చంపేట ఎమ్మెల్యే దంపతులు చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్మీచెన్నకేశవ బ్రహ్మోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ఇమ్మడి నరహరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
భుజాలపై ఎత్తుకుని కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వ సంపద అని, వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. తన తండ్రి కాకా పేరిట ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, ఆలయ చరిత్ర అందరికీ తెలిసేలా చూస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ 400 ఏండ్ల కింద పల్నాడు యుద్ద సమయంలో బ్రహ్మనాయుడు సైన్యానికి ఇక్కడే యుద్ద నైపుణ్య శిక్షణ నిర్వహించేవారని చెప్పారు. ఆలయ అర్చకులుగా మాల దాసరులే వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం 320 అడుగుల ఎత్తున కొండపై ఉన్న స్వామి మూల విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనిల్, కుంద మల్లికార్జున్, అంజి, రవి, ఆనంద్ పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయలగండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యేతో కలిసి ఒకే కోర్టులో సర్వీస్ బాల్‌ను అటెంప్ట్ చేశారు. నిర్వాహకులను అభినందించారు.