రేషన్​ కార్డులపై ఆందోళన వద్దు : వివేక్ వెంకటస్వామి

  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరుకు అదనంగా టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్ కేటాయించాలనిప్రభుత్వాన్ని కోరా 
  • అభివృద్ధితో మున్సిపాలిటీని ఆదర్శంగా మారుస్తానని వెల్లడి

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్​కార్డులు ఇస్తామని, లిస్టులో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీస్‌‌‌‌లో వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నవంబర్‌‌‌‌లో చేపట్టిన సోషియో ఎకానమీ సర్వే ప్రకారం రేషన్ కార్డులకు అర్హుల జాబితా వచ్చిందన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు లిస్టుల్లో రాలేదని చాలా మంది ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే, జాబితాలో పేరు లేని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ కార్డులు అందజేస్తామని ఆయన భరోసా కల్పించారు. 

చెన్నూరు మున్సిపాలిటీల్లో 80 శాతం పనులు కంప్లీట్‌‌..

చెన్నూరు మున్సిపాలిటీలోని వార్డుల్లో డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్‌‌తో చేపట్టిన అభివృద్ధి పనులు 80 శాతం పూర్తయ్యాయని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో చెన్నూరు మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి గత పాలకులు ఫండ్స్ కేటాయించలేదని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యే అయ్యాక చెన్నూరు మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్ మంజూరు చేసి పనులు చేపట్టామని చెప్పారు. 

త్వరగా మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయాలని మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు. చెన్నూరు మున్సిపాలిటీకి ప్రత్యేకంగా టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్ అదనంగా కేటాయించాలని ఇటీవల రాష్ట్ర సెక్రటరీని కోరానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వివిధ విభాగాల ఆఫీసర్లతో అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ చేపట్టారు. 

అంతకు ముందు జైపూర్ మండలం ఇందారం క్రాస్ వద్ద కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైపూర్ ఉమ్మడి మండల లారీ అసోసియేషన్ బాధ్యులు ఎమ్మెల్యేలను కలిసి వారి సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ లీడర్ జుల్ఫికర్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ కరుణాసాగర్ రావు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, పీఎస్‌‌సీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, లీడర్లు ఐత హేమవంత్ రెడ్డి, బండి సదానందం యాదవ్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పొడెటి రవి, జైపూర్ మండల ప్రెసిడెంట్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.