సింగరేణి భూములిస్తే మున్సిపాలిటీల్లో అభివృద్ధి : వివేక్‌ వెంకటస్వామి 

సింగరేణి భూములిస్తే మున్సిపాలిటీల్లో అభివృద్ధి : వివేక్‌ వెంకటస్వామి 
  • గత బీఆర్ఎస్‌ సర్కార్‌‌ ప్రజల కష్టాలను పట్టించుకోలే 
  • మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రివ్యూ మీటింగ్‌లో చెన్నూర్‌‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: పదేండ్ల పాలనలో బీఆర్ఎస్‌ సర్కార్‌‌ ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో మిషన్​ భగీరథ, మున్సిపల్, ఆర్అండ్​బీ, రెవెన్యూ శాఖల రివ్యూ మీటింగ్‌లకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మున్సిపాలిటీల్లోని వివిధ సమస్యలపై రివ్యూ చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, క్యాతన్ పల్లి రైల్వే బ్రిడ్జి పనుల ప్రగతిపై అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సరిగా నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు జరగలేదన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భూములన్నీ సింగరేణి పరిధిలో ఉన్నాయని, శ్మశాన వాటిక కోసం 25 ఎకరాలు ఇవ్వాలని సీఎండీ ఎన్.బలరాంనాయక్​ తో ఇప్పటికే మాట్లాడనని, ఇదే విషయంపై  మరో రెండు మూడు రోజుల్లో ఆయనను కలువనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి భూమి ఇస్తేనే మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు.  మంచిర్యాలలోని తన నివాసంలో కోటి అమూల్య ఆధ్వర్యంలో పాడిన ‘బోనాలు షురూ.. మా బోనాలు సూడు' అనే సాంగ్​ను ఆయన రిలీజ్​ చేశారు.  మందమర్రి మున్సిపల్​ ఆఫీస్​ అవరణలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మొక్కలు నాటారు.  

నిధులు లేకున్నా ప్రచారం ఆర్భాటం

పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఎలాంటి సదుపాయాలను కల్పించలేదని, నిధులు లేకున్నా హంగులు ఆర్భాటాల పేరుతో ప్రచారం చేసుకుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గద్దె రాగడి, దీపక్​నగర్​, శ్రీపతినగర్​ ప్రాంతాల్లో తాగునీరు సప్లై,  రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. మందమర్రిలో అమృత్ స్కీమ్ కింద రూ.31 కోట్ల తో డ్రింకింగ్ వాటర్ సమస్యను తీర్చనున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మందమర్రిలోని దీపక్​నగర్​, శ్రీపతినగర్​లో పర్యాటించి ప్రజలసమస్యలు అడిగితెలుసుకున్నారు. ఎస్‌వీ టెంపుల్​ ఏరియాలోని వైకుంఠధామాన్ని పరిశీలించారు.  పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్​లైటింగ్​ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భారత్​నగర్, అమ్మ గార్డెన్​ ఏరియాల్లో పర్యటించి కొత్తగా ఏర్పాటు చేసే  రోడ్లు, డ్రైయినేజీలను పరిశీలించారు. రామకృష్ణాపూర్​ సూపర్‌‌బజార్‌‌ ఏరియాలోని  తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మందమర్రికి చెందిన బత్తుల రమేశ్‌ను కాంగ్రెస్​ లీడర్లతో కలిసి పరామర్శించారు.  రివ్యూ మీటింగ్​ల్లో మందమర్రి తహసీల్దార్​ చంద్రశేఖర్​,  మున్సిపల్​ కమిషనర్లు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, డీఈ సునీతా, ఏఈ అచ్యుత్​, అర్​అండ్​బీ డీఈ రమేశ్​, క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డి, మిషన్​ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి ఎన్నికల కోసం ఎమ్మెల్యే వివేక్​కు జేఏసీ వినతి

కోల్​బెల్ట్​, వెలుగు: మందమర్రి మున్సిపల్​ ఎన్నికల నిర్వహణ కోసం చొరవచూపాలని ఎన్నికల జేఏసీ ప్రతినిధులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి విన్నవించారు. శనివారం  ఎమ్మెల్యేను మంచిర్యాలలోని ఆయన నివాసంలో కలిశారు. 31ఏళ్లుగా మందమర్రి మున్సిపాలిటికి ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఎన్నికల జేఏసీ కార్యాచరణ కొనసాగించాని, మరో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మందమర్రి మున్సిపల్​ ఎన్నికల విషయాన్ని సర్కార్​ దృష్టికి తీసుకవెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు గుడికందుల రమేష్, కస్తూరి శ్రీనాథ్ చారి, రామంచ తిరుపతి, సోనాల్ శర్మ  తదితరులు ఉన్నారు.