మాలల సంక్షేమం కోసమే ఉద్యమం...సమాజంలో మాలలకు గౌరవం దక్కడం లేదు:  చెన్నూరు ఎమ్మెల్యే 

మాలల సంక్షేమం కోసమే ఉద్యమం...సమాజంలో మాలలకు గౌరవం దక్కడం లేదు:  చెన్నూరు ఎమ్మెల్యే 
  • హైదరాబాద్‌‌లో జరిగే సభను సక్సెస్‌‌ చేయాలని పిలుపు
  • ఖమ్మంలో మాలలు, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే

ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్యమంలో ముందుండాలనేదే తన ఆలోచన అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. సమాజంలో మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై మాలలు ముసుగులు వేసుకొని కూర్చుంటే నడవదని, అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన మాలలు, మాల ఉపకులాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్‌‌ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. తమ జాతి సంక్షేమం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్‌‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా తాను ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశానని గుర్తుచేశారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తానంటే వాళ్లు భయపడుతున్నారన్నారు. మాలలు వేర్వేరు సంఘాలు పెట్టుకోవద్దని సూచించారు. అన్ని కులాల వారు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం పెట్టనోళ్లు.. మాలల సమావేశానికి అభ్యంతరం తెలుపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

మాదిగలతో కాదు, మనువాదులతోనే కొట్లాట: ఎమ్మెల్యే నాగరాజు

వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం మాదిగలపై కొట్లాట కాదని, మనువాద తత్వం కలిగిన మందకృష్ణ మాదిగపైనే పోరాటమని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్‌‌లో 10 లక్షల మందితో జరిగే మాలల సింహ గర్జనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 30 ఏండ్లుగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో మాలలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా భవిష్యత్ తరాల కోసం ఉద్యమించాలన్నారు. ప్రధాని మోదీ చెవులు పగిలిపోయేలా, సింహ గర్జనలో మాలల గొంతుకను వినిపించాలన్నారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. వర్గీకరణపై పార్లమెంట్‌‌లో బిల్లు పెడితే మెజారిటీ రాదని భావించి, సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. వర్గీకరణను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. అంతకు ముందు ఖమ్మంలోని నయబజార్ కాలేజ్ ప్రాంగణం నుంచి మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ పల్లా రాజశేఖర్ అధ్యక్షత వహించగా, సమావేశంలో డాక్టర్ గోపీనాథ్, గుంతేటి వీరభద్రం, మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ డి.సర్వయ్య, సమతా సైనిక్ దళ్ దేశ ఉపాధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే, రాష్ట్ర కార్యదర్శి మేకల రవీందర్ పాల్గొన్నారు. 

నేను ఎవ్వరికీ భయపడ..

ఎమ్మెల్యేలు వివేక్‌‌, నాగరాజును తప్పిస్తే మాలల ఉద్యమం నడవదని కొందరు భావిస్తున్నారని, కానీ తాను ఎవరికీ భయపడనని వివేక్‌‌ అన్నారు. ఏదైనా పద్ధతి ప్రకారం చేస్తానని కామెంట్ చేశారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌‌లో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తనను జైల్లో పెట్టించాడని, అయినా బెదరలేదన్నారు. కేసీఆర్ కూడా తనను తీవ్రంగా వేధించాడని. అయినా వెనక్కి తగ్గకుండా ఆయన అవినీతిని ఎండగట్టానని చెప్పారు. ఆత్మ గౌరవం లేని చోట మనం ఉండకూడదని తన తండ్రి నేర్పాడని, తాను అదే ఫాలో అవుతున్నానన్నారు.

మాజీ సీఎం సంజీవయ్య స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, తన తండ్రి వెంకటస్వామి సంజీవయ్య ఫాలోవర్ అని చెప్పారు. ఎస్సీల కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కొట్లాడేవారని, వారి కోసం గుడిసెలు వేయించారని గుర్తుచేశారు. అందుకే ఆయనను గుడిసెల వెంకటస్వామిగా మారిందన్నారు. నాగర్ కర్నూల్‌‌లో జరిగిన మాలల సభ చూసి కొందరికి భయం పట్టుకుందని చెప్పారు. డిసెంబర్ 1న హైదరాబాద్‌‌లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని కూడా సక్సెస్‌‌ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.