- ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తది: వివేక్ వెంకటస్వామి
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోలే
- ఇబ్బందులు చెప్పుకునేందుకు లీడర్లను కలువలేని పరిస్థితి ఉండేదని విమర్శ
- సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ
కోల్‌బెల్ట్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. జనం పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు ప్రజాపాలనను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ 14వ వార్డు మార్కెట్ ఏరియాలో నిర్వహించిన ప్రజాపాలన, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, మంచిర్యాలలోని షారోన్ గాస్పెల్ చర్చిలో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో స్థానికుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, కనీసం ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధులను కూడా కలువలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమానికి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని, కాంగ్రెస్‌ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కాకుండా డేటా ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలను పరిష్కరిస్త
సింగరేణిలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉద్యోగులు ఐఎన్టీయూసీ గెలుపు కోసం పని చేశారని, వారి సమస్యలను తీర్చేందుకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఒకే సంఘంగా ఉంటే సమస్యలు తీరుతాయని సూచించారు. పాస్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ బాధ్యులు.. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన సప్త శత చండీ యాగంలో వివేక్ పాల్గొని పూజలు చేశారు. మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మందమర్రి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, క్యాతనపల్లి మున్సిపల్ మేనేజర్ నాగరాజు, బొక్కలగుట్ట, చిర్రకుంట సర్పంచులు బోలిశెట్టి సువర్ణ, ఓడ్నాల కొమురయ్య, నేతలు పి.రాఘునాథ్‌రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, నోముల ఉపేందర్‌గౌడ్, పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.