- స్వార్థం లేకుండా సేవ చేసినవారికి చరిత్రలో గుర్తింపు ఉంటుంది: వివేక్ వెంకటస్వామి
- ‘అంబేద్కర్’ బీఎస్ వెంకట్రావు 126వ జయంతి కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే
అల్వాల్/జీడిమెట్ల/మెహిదీపట్నం, వెలుగు: మహనీయుల స్ఫూర్తితో సమాజ సేవ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురంలో నిర్వహించిన ‘హైదరాబాద్ అంబేద్కర్’అని పిలుచుకునే బీఎస్ వెంకట్రావు 126వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఎస్ వెంకట్రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. నిజాం హయాంలో హైదరాబాద్ స్టేట్ సంస్థానంలో దళిత నాయకులు కీలక భూమిక పోషించారన్నారు.
మాదరి భాగ్యరెడ్డి వర్మ, బీఎస్ వెంకట్రావు, బత్తుల శ్యాంసుందర్, అరిగ రామస్వామి, మాదరి ఆదయ్య, జెట్టి ఈశ్వరి బాయి లాంటివారు సమాజంలో అణగారిన వర్గాల కోసం ఎంతో సేవలందించాలని తెలిపారు. ఇటీవల కాలంలో రాజకీయ కక్షతో దళితుల్లో చీలిక తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నదని, ప్రధానంగా మాల జాతి సామాజిక వర్గం తక్కువ జనాభా ఉన్నారని పలువురు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 1న జరిగిన సింహగర్జన సభతో వారి విమర్శలు పటా పంచలయ్యాయన్నారు. మహనీయుల స్ఫూర్తితోనే తన తండ్రి గడ్డం వెంకటస్వామి జంట నగరాల్లో 80 వేల మందికి పైగా పేదలకు గుడిసెలు వేయించి ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించారని గుర్తుచేశారు.
అయన అడుగుజాడల్లోనే పేదలకు సేవలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. సమాజంలో స్వార్థం లేకుండా సేవలందించిన వారికి చరిత్రలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. మరోవైపు, కుత్బుల్లాపూర్‌లోని ఏడీపీఎల్ కాలనీ రాంకీ ట్రూ స్పేస్‌లో తన అనుచరులు వినుకొండ శ్రీధర్ పటేల్, సతీశ్ కుమార్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్పటేల్, సతీశ్ కుమార్ఎమ్మెల్యే వివేక్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి ఉపాధ్యక్షుడు అంబాల మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్
ప్రముఖ సంఘ సేవకుడు రాజు ఉస్తాద్ మెహిదీపట్నంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమానికి వచ్చిన వివేక్‌ను రాజు ఉస్తాద్ ఘనంగా సన్మానించారు.