
- కాళేశ్వరం, మిషన్ భగీరథ నిధుల దుర్వినియోగం
- బీఆర్ఎస్ సింగరేణిలో 60వేల ఉద్యోగాలు తీసేసింది
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తం
- క్యాతనపల్లి కాంగ్రెస్ మీటింగ్‌లో చెన్నూరు ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్, వెలుగు: పదేండ్ల పాలనలో కేసీఆర్ రూ.8లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, వాళ్లు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ తెలంగాణను కాపాడుతున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం పేరుతో రూ.1.25లక్షల కోట్లు, భగీరథ పేరిట రూ.60 వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్విస్తృత స్థాయి సమావేశానికి వివేక్ వెంకటస్వామి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. పీసీసీ అబ్జర్వర్లు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, రాంభూపాల్, మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. వివేక్ మాట్లాడుతూ కేసీఆర్హయాంలో ప్రవేశపెట్టిన స్కీమ్‌లన్నీ ఫెయిల్ అయ్యాయని, నిధులు మింగేందుకే పథకాలు పెట్టిండన్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందన్నారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 3వేలకు పరిమితం కాకుండా ఇంకా ఎక్కువ ఇండ్లు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు రాలేదని అర్హులు ఆందోళన పడొద్దని అందరికి మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. పడేండ్లలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిండని, కొడుకు కేటీఆర్, బిడ్డ కవితకు మాత్రం ఫామ్‌హౌస్‌లు కట్టించిండన్నారు.
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
చెన్నూరు పరిధిలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ ప్రజల సమస్యలు, అభివృద్ధి పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరులో ఇసుక దందా జోరుగా సాగిందని, తాను ఎమ్మెల్యే అయ్యాక ఆ దందాను అడ్డుకున్నట్లు చెప్పారు. మందమర్రి మున్సిపాల్టీలో రూ.20 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సాగుతున్నదని, త్వరలో మరో రూ.20 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అమృత్ స్కీమ్ కింద తాగునీటి సప్లై కోసం తానూ.. ఎంపీ వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రూ.100 కోట్లు మంజూరు చేయించామని, స్కీం పనులు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలపై కార్యకర్తలు ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. జంగా రాఘవ రెడ్డి, రాంభూపాల్, సురేఖ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. గ్రామ, మండల, పట్టణ, బ్లాక్ స్థాయి కమిటీలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతులకు నివాళి అర్పించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ రఘునాథ్‌రెడ్డి, క్యాతనపల్లి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లె రాజు పాల్గొన్నారు.
మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పరిశీలన
సమావేశానికి ముందు వివేక్ మందమర్రి మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. భవిష్యత్‌లో చేపట్టే పనులు, సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. వార్డుల్లోని రోడ్లకు రిపేర్లు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగును ఆదేశించారు.