నాలెడ్జ్​ పెంచుకుంటేనే  సమాజంలో గౌరవం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నాలెడ్జ్​ పెంచుకుంటేనే  సమాజంలో గౌరవం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • దళితులు అభివృద్ధి సాధించాలంటే అందరికంటే 10 శాతం ఎక్కువ కష్టపడాలి: వివేక్
  • విద్య, రిజర్వేషన్లతోనే సామాజిక అభివృద్ధి
  • కలిసి పోరాడితేనే అనుకున్నది సాధిస్తామని వ్యాఖ్య
  • సంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరు

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: నాలెడ్జ్​ పెంచుకోవడం ద్వారానే సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. దళిత వర్గాలు అభివృద్ధి సాధించాలంటే అందరికంటే 10 శాతం ఎక్కువ కష్టపడాలన్నారు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం కమలాపూర్‌‌ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌‌ విగ్రహాన్ని ఖేడ్‌‌ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, విగ్రహ దాత, దళిత సంఘం రాష్ట్ర నాయకుడు సూర్యప్రకాశ్​తో కలిసి ఎమ్మెల్యే వివేక్ గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివేక్ మాట్లాడారు. దళితుల అభివృద్ధి కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి చాలా కష్టపడ్డారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాకా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు.

దళితులను మరింత ముందుకు నడిపిస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘‘భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లంతా తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి కోసం పని చేయాలి. దళితవర్గాల అభ్యున్నతికి కాకా ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ రోజుల్లోనే 75 వేల మంది పేదలకు ఆయన హైదరాబాద్​లో ఇండ్ల స్థలాలు ఇప్పించారు.

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చదువు ఎంతో అవసరం. నాన్నగారి ఆశయ సాధన కోసం హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో అంబేద్కర్ ఎడ్యుకేషన్ పేరుతో 2 లక్షల మంది స్టూడెంట్లకు కార్పొ రేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నాం’’అని వివేక్ అన్నారు. నిమ్నవర్గాలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలన్నారు. క్రమశిక్షణ కలిగి ఉండాలని, కలిసి ఐక్య పోరాటలు చేస్తేనే ఏదైనా సాధిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌‌ చూపిన దారిలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు.

అంబేద్కర్ వారసుడు.. కాకా: నల్ల సూర్యప్రకాశ్

మాజీ మంత్రి, దళితుల ఆశాజ్యోతి వెంకటస్వామి (కాకా) అంబేద్కర్ కు నిజమైన వారసుడని దళిత సంఘం రాష్ట్ర నాయకుడు నల్ల సూర్య ప్రకాశ్ కొనియాడారు. చదువు ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల్లో కాకా చైతన్యం నింపారన్నారు. చదువు అనేది ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని నమ్మిన వారిలో కాకా ఒకరని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే సంజీవ రెడ్డి

భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు పొందడం ద్వారా ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగొచ్చని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు.

అంతకుముందు మంగల్ ఘాట్ నుంచి కమలాపూర్ వరకు దళిత సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌‌ రాష్ట్ర కార్యదర్శి రాకేష్‌‌ షెట్కార్, జీఎంఆర్‌‌ ఫౌండేషన్‌‌ చైర్మన్‌‌ గుర్రపు మశ్చేందర్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్‌‌ మారుతి, నాయకులు దిగంబర్ కాంబ్లే, ప్రకాష్‌‌ రాథోడ్, రమేశ్ చౌహాన్, రవీందర్‌‌ నాయక్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.