మనం అంబేద్కర్ దారిలో నడవాలి:వివేక్ వెంకటస్వామి

  • పార్టీల్లో మాలలపై చర్చ ఎందుకు జరగదు: వివేక్ వెంకటస్వామి
  • మాలల సింహగర్జన సభకు తరలిరావాలని పిలుపు

ముషీరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: మాలలంతా అంబేద్కర్ దారిలో నడవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల్లో మాలల మీద చర్చ ఎందుకు జరగదు అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ జిల్లా చైర్మన్ రాజు వస్తాద్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ముషీరాబాద్ లోని డీబీఆర్ మిల్లు వద్ద హలో మాల.. చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన కరపత్రాన్ని మహిళలతో కలిసి రిలీజ్ చేసి మాట్లాడారు.

 రాష్ట్రవ్యాప్తంగా మాలలంతా బయటకు వచ్చి మన సత్తా, సంఖ్యను చూపించాలని కోరారు. గత రెండు నెలల నుంచి మాలలను చూసి తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభాతో మాలలు రెండో స్థానంలో ఉన్నామని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహ గర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మాలలు ఏ కార్యక్రమం చేపట్టిన పెద్ద ఎత్తున తరలి  వస్తున్నారని మొన్న జరిగిన నాగర్ కర్నూల్ సభ బ్రహ్మాండంగా విజయవంతమైదన్నారు. 

ఇందిరమ్మకు ఘన నివాళి

ఇండియా ప్రధానిగా ఇందిరమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారని వివేక్​ వెంకట స్వామి అన్నారు. ఇందిరా గాంధీ 107 జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డితో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిగా ఇందిరా గాంధీ నిత్యం దేశ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించేవారన్నారు. దేశాన్ని బీద తరం నుంచి డెవలపింగ్​నేషన్​గా చేయడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. 

పేదల అభివృద్ధికి అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. 1978లో ఆమె చొరవతో నే ఇందిరాగాంధీ కోర్​కమిటీలో మా నాన్న వెంకటస్వామి గారికి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గొప్పవ్యక్తులన్నారు. సీఎం రేవంత్​రెడ్డి త్వరలో ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు ఇస్తారని.. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.