- కలిసి ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు: వివేక్ వెంకటస్వామి
- జిల్లాలవారీగామీటింగ్లు పెట్టుకోవాలి
- త్వరలో పాలమూరులో మాలల సభ
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
- మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
మహబూబ్‌నగర్, వెలుగు: మాలలంతా ఐక్యంగా ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో కులగణన జరగాలని, జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం జరగాలని అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కలిసి కట్టుగా ముందుకు సాగితేనే మనకు కొత్త స్ట్రెంత్ వస్తుంది.
హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి” అని అన్నారు. కులగణన చేపట్టినప్పుడే మన బలం ఎంతో తెలుస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన కోసం రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణ విషయంలో అందరికి అవగాహన కల్పించాలని అన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మాలల గ్రోత్ యాడ్ చేయలేదని ఆయన తెలిపారు. మాలలకే ఎక్కువ పోస్టులు వస్తున్నట్లు మొదటి నుంచి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. మాలల ఓట్లు స్టేబుల్‌గా ఉంటాయని, వారు ఎవరికి ఓటు వేస్తారో వాళ్లే గెలుస్తారని చాలాసార్లు రుజువైందని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు.
మన జాతికి గుర్తింపు తేవాలి
తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడు తాను నియోజకవర్గంలో తిరిగేవాడినని, తనను కలిసిన వారెవరూ తాము మాలలమని చెప్పుకునే వారు కాదని వివేక్ వెంకటస్వామి అన్నారు. తమ ఉనికిని చాటుకొని జాతికి గుర్తింపు తేవాలని ఆయన సూచించారు. కలిసి పనిచేస్తేనే అందరికీ మన సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.
కలిసిమెలిసి జిల్లాల వారీగా మీటింగ్‌లు పెట్టుకోవాలని, ఐక్యంగా ఉంటే హక్కులు సాధించుకోవచ్చని తెలిపారు. తాము వెన్నంటి ఉంటామని, ఈ భరోసా ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. త్వరలో ఉమ్మడి పాలమూరులో జిల్లాలో 2 లక్షల మందితో భారీ సభ నిర్వహిద్దామన్నారు. సమ్మేళనంలో డాక్టర్ గోపీనాథ్, మాల సంఘం లీడర్లు కాంబ్లే, రవీందర్, నారాయణ, రమాకాంత్, చెన్నయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.