- కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతికి పాల్పడ్డడు
- బ్యాక్ వాటర్‌తో పంటలు మునిగినా పట్టించుకోలేదు
- రైతులను నిండా ముంచిండని ఫైర్
- పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి
కోల్‌బెల్ట్, వెలుగు: కాళేశ్వం, మిషన్‌భగీరథ పేరుతో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆయన కుటుంబం, కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. కేసీఆర్ తో లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు.. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.500 కోట్లను కమీషన్లుగా బీఆర్ఎస్ కు అందజేశారని ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ప్రపంచంలోనే ధనవంతుడయ్యాడని అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జైపూర్, భీమారం మండలాల పరిధిలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, మత్య్స సహకార సంఘం సభ్యులు వివేక్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో వేల ఎకరాల్లో పంటలు, పట్టణాలు మునిగిపోయినా కేసీఆర్ పట్టించుకోలేదు.
ఆయన రాత్రి పుస్తకాలు చదివి ప్రాజెక్టు కట్టిండు.. రైతులను నిండా ముంచిండు. కాళేశ్వరం కట్టి ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేదు” అని ఫైర్ అయ్యారు. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్‌భగీరథ పైప్ లైన్ల తవ్వకాలతో రోడ్లన్నీ ఖరాబయ్యాయని పేర్కొన్నారు. తాగు నీళ్ల సప్లై కోసం రూ.2 కోట్ల నిధులు కేటాయించామని, లోక్ సభ ఎన్నికల తర్వాత పనులు పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీరుస్తామని తెలిపారు. ‘‘నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాను. ప్రజలు నాకు కొంచెం టైమ్ఇవ్వాలి. నీటి సమస్య పరిష్కారానికి విశాక చారిటబుల్‌ట్రస్టు ద్వారా బోర్లు వేయిస్తాం” అని చెప్పారు. ‘‘పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా కుటుంబం 60 ఏండ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నది. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నా కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీరందరూ ఆదరించి భారీ మోజార్టీతో గెలిపించాలి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
చెన్నూరు నియోజకవర్గం జైపూర్, భీమారం మండలాలకు చెందిన బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుందారం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్బూతగడ్డ బాలయ్య ఆధ్వర్యంలో, గౌడసంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ లో చేరారు. పౌనూర్మాజీ సర్పంచి సారయ్యతో పాటు వార్డు మెంబర్లు, సోషల్‌మీడియా బాధ్యులు, కార్యకర్తలు పార్టీలో చేరారు.