అప్పుడు బ్యాన్​..ఇప్పుడు బద్నామ్..వీ6, వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్

  • వీ6, వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫైర్​
  • కేటీఆర్​ చెప్తున్న వీ6 బిజినెస్​ సొల్యూషన్​తో 
  • వీ6-వెలుగుకు ఎలాంటి సంబంధం లేదు
  • కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నడు
  • సోషల్ మీడియాలో బీఆర్​ఎస్​ టీమ్​ బురద జల్లుతున్నది
  • కేటీఆర్​కు దమ్ము, ధైర్యం ఉంటే  ఆరోపణలు నిరూపించాలి
  • ఎఫ్టీఎల్, బఫర్ జోన్​ రూల్స్​కు లోబడే మా ఫామ్​హౌస్​ ఉంది
  • ఎప్పుడు, ఎవరు వచ్చినా ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అని సవాల్​

హైదరాబాద్, వెలుగు : వీ6 చానల్​, వెలుగు దినపత్రికపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విషం కక్కుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫైర్​ అయ్యారు. “కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలి. నేను దేనికైనా రెడీ.  కేసీఆర్, కేటీఆర్, కవిత  అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధం” అని ఆయన సవాల్​ చేశారు. 

తన జీవితంతో ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని, తాను నడిపే అన్ని సంస్థలు చట్టబద్ధంగానే ఉన్నాయని తెలిపారు.  కేటీఆర్​ చెప్తున్న  వీ6 బిజినెస్ సొల్యూషన్ తో తమ వీ6– వెలుగుకు ఏమాత్రం సంబంధం లేదని వివేక్​ స్పష్టం చేశారు. వీ6 బిజినెస్​ సొల్యూషన్​ అనేది బెంగళూరుకు చెందిన సంస్థ అని తెలిపారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీ6, వెలుగును కేటీఆర్ బ్యాన్ చేశారని, ఇప్పుడు వీ6 బిజినెస్ సొల్యూషన్స్​ పేరు చెప్పి తమను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం సెక్రటేరియెట్ లో వివేక్​ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఓ తుగ్లక్. రాత్రి పూట నిర్ణయాలు తీసుకొని తెల్లారే సరికి అమలు చేస్తుండె. తప్పుడు ఆరోపణలు చేయడంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ పెద్ద తుగ్లక్” అని విమర్శించారు. 

కేటీఆర్​..! వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు

కేటీఆర్, బీఆర్ఎస్  టీం సోషల్ మీడియా వేదికగా తనపై, తమ సంస్థలపై అసత్యాలను ప్రచారం చేస్తున్నదని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘వీ6 బిజినెస్ సొల్యూషన్స్ సంస్థకు కర్నాటక వాల్మీకి స్కామ్​లో భాగం ఉందంటూ, ఆ సంస్థకు రూ. 4.5 కోట్లు బదిలీ అయ్యాయంటూ కేటీఆర్  ఆరోపణలు చేస్తున్నడు. ఆ సంస్థను వీ6 –వెలుగుకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నడు. 

Also Read:-15 రోజుల్లో వీసీలు..వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లనూ నియమిస్తం

కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నడు. నెట్ లోకి వెళ్లి చెక్ చేస్తే నిజా నిజాలు బయటకు వస్తయ్​. వీ6 బిజినెస్​ సొల్యూషన్స్​ సంస్థకు బెంగళూరులోని హంపీనగర్ లో ఆఫీసు ఉంది.  వీ6 బిజినెస్ సొల్యూషన్స్ తో వీ6 – వెలుగు మీడియాకు ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసేముందు ఒకసారి వాస్తవాలను తెలుసుకోవాలని కేటీఆర్​కు ఆయన చురకలంటించారు. తనపై చేసిన ఆరోపణలు కేటీఆర్ నిరూపిస్తే.. తాను దేనికైనా సిద్ధమని సవాల్​ చేశారు. తమ సంస్థలన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని తెలిపారు. 

రూల్స్​కు లోబడే ఫామ్​హౌస్​ కట్టుకున్నం

పదేండ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ సినిమా స్టార్స్ తో కుమ్మకై ఎఫ్టీఎల్ లో ఉన్న బిల్డింగ్స్​ను కూల్చలేదని, కానీ తమ ప్రభుత్వం ఆ పని ప్రారంభించిందని వివేక్​ వెంకటస్వామి చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో తాను ఫామ్​హౌస్ కట్టినట్టు నమస్తే తెలంగాణ పత్రిక అసత్యాలను రాసిందని ఆయన మండిపడ్డారు. తాను 2006లో స్థలాన్ని కొనుగోలు చేసి ఫామ్​హౌస్ నిర్మించినట్టు వివరించారు. వాస్తవానికి ఏ చెరువుకైనా 30 మీటర్ల ఎఫ్టీఎల్ ఉంటుందని, ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటుందని చెప్పారు. అవన్నీ దాటిన తర్వాతే తన ఫామ్ హౌస్​ ఉందని ఆయన తెలిపారు.  

.నమస్తే తెలంగాణలో చూపించిన ఫామ్​హౌస్ తనది కాదని వివేక్​ స్పష్టం చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివేక్ పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు లోబడే తాను ఫామ్​హౌస్​ కట్టుకున్నానని, తన వద్దకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఎప్పుడూ ప్రజల పక్షమే

వీ6, వెలుగు ఎప్పుడూ ప్రజల పక్షమేనని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే వీ6 చానల్ ప్రారంభమైందని గుర్తుచేశారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ వీ6 చానల్​ను  ఎంత ఇబ్బంది పెట్టినా, ఎక్కడా వెనుకడుగు వేయకుండా తెలంగాణ కల్చర్ ను కండ్లకు కట్టినట్లు చూపించామని వివరించారు.  ‘‘బీఆర్ఎస్ హయాంలో వెలుగు దినపత్రికకు కావాలనే ప్రభుత్వ అడ్వర్టయిజ్​మెంట్లు ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రాల పేపర్లకు కూడా ప్రకటనలు ఇచ్చి వెలుగుకు మాత్రం ఇవ్వలేదు.

 ప్రభుత్వం తరపున రావాల్సిన ప్రకటనలు రాకపోవడంతో దాదాపు రూ. 150 కోట్ల నష్టం జరిగింది. అయినా ఎక్కడా రాజీపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకగా వెలుగు దినపత్రిక నిలిచింది” అని అన్నారు. ఉద్యమ టైమ్​లో తెలంగాణ గొంతుకగా నిలిచిన వీ6 చానల్​.. ఆ తర్వాత స్వరాష్ట్రంలోనూ వెలుగు దినపత్రికతో కలిసి జనం కోసం నిలబడిందని తెలిపారు. బీఆర్ఎస్  ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను ఎప్పటికప్పుడూ ఎండగట్టిందని వివరించారు. ప్రజల తరఫున పోరాడుతున్నందుకు అప్పట్లో వీ6, వెలుగును కేటీఆర్​ బ్యాన్​ చేశారని.. ప్రజలు మాత్రం వీ6, వెలుగును మరింత ఆదరించారని తెలిపారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు మా మీడియా సంస్థలను బ్యాన్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు బద్నాం చేసే కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నడు. కేటీఆర్​ ఎంత విషం చిమ్మినా మా మీడియా సంస్థలు ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాయి” అని వివేక్​అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై తనపై ఈడీ దాడులు చేయించారని, విజయన్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా రూ. 8 కోట్లు పట్టుకున్నారని, నిజాలు నిగ్గు తేల్చడంతో ఈడీ ఆఫీసర్లు తమ డబ్బులను తిరిగి ఇచ్చేశారని ఆయన తెలిపారు. అవకాశం దొరికినప్పుడల్లా కేటీఆర్ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజులుగా తనపై, తన ఫామ్​హౌస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే నిజానిజాలను తెలంగాణ  ప్రజలకు వివరించానని వివేక్​ వెంకటస్వామి అన్నారు. 

కేసీఆర్​ అవినీతిని బయటపెట్టినందుకే కక్ష

కేసీఆర్ కుటుంబం అవినీతిని వీ6, వెలుగు మీడియా బయటపెట్టిందనే కక్షతోనే కేటీఆర్ తనపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని వివేక్​ వెంకటస్వామి ఫైర్​ అయ్యారు. కేటీఆర్ కు దమ్ము , ధైర్యం ఉంటేఆ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. గత బీఆర్​ఎస్​ సర్కార్​ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 33 వేల కోట్ల  నుంచి రూ. లక్షా 25 వేల కోట్లకు పెంచి అందినంత దోచుకున్నదని వివేక్ అన్నారు. 

మిషన్ భగీరథ స్కీంలోనూ భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ‘‘2019 పార్లమెంట్ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అని ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్లి కేవలం 9 సీట్లే గెలుచుకున్నరు. ఆ ఎన్నికల్లో సాక్షాత్తు  కేటీఆర్ చెల్లె కవిత ఓడిపోయారు. కేటీఆర్ తన సొంత చెల్లెను గెలిపించుకోలేకపోయిండు” అని ఆయన విమర్శించారు.