
- తెలంగాణలో తప్ప ఎక్కడా ఇవ్వడం లేదు: వివేక్
- బీఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం దందా సాగింది
- అందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని వెల్లడి
కోల్ బెల్ట్/బషీర్‌బాగ్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి ఆలోచనపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా వివేక్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మాత్రమే పంపిణీ చేస్తున్నదన్నారు. ‘‘రేషన్ లబ్ధిదారులంతా సన్న బియ్యాన్ని వాడుకోవాలి.
గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన దొడ్డు బియ్యం మంచిగుండేవి కావు. రేషన్ బియ్యం పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దందా చేసిన్రు. ప్రతి పేదోడు కడుపు నిండా తినాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రభుత్వంలో పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా చూస్తున్నాం. అర్హులైన రైతులకు రుణమాఫీ చేసినం. రైతు భరోసా కూడా వర్తింపజేస్తాం’’అని వివేక్ అన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.
సీఎం రేవంత్, ఎమ్మెల్యే ఫొటోలకు పాలాభిషేకం
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అంగడిబజార్ ఏరియా రేషన్‌షాప్‌లో లబ్ధిదారులు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ లీడర్ సోతుకు సుదర్శన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీ, మహిళా, మైనార్టీ విభాగాల ప్రెసిడెంట్లు నెరువెట్ల శ్రీనివాస్, గడ్డం రజనీ, ఎండీ.జమీల్, లీడర్లు మందా తిరుమల్ రెడ్డి, సట్ల సంతోశ్, రాయబారపు కిరణ్, మంకు రమేశ్, రాచర్ల గణేశ్, శంకర్‌గౌడ్, రాజు, సుకూర్, ఆంజనేయులు, వీరన్న, మాయ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
నారాయణ సేవా సంస్థాన్ సేవలు గొప్పవి
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఉచితంగా అందిస్తున్న నారాయణ సేవా సంస్థాన్ సేవలు గొప్పవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ నెల 6న దివ్యాంగులకు స్క్రీనింగ్, మెజర్మెంట్ క్యాంప్ ను చంపాపేట్‌లోని మినర్వ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాలని వివేక్ వెంకటస్వామిని సంస్థాన్ ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థాన్ సేవలను వివేక్ కొనియాడారు.
నారాయణ్ సేవా సంస్థాన్ కొన్నేండ్లుగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నది. వారి జీవితాల్లో వెలుగును నింపుతున్నది. దివ్యాంగులంతా ఈ క్యాంప్‌లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’అని వివేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ సేవా సంస్థాన్ ప్రతినిధులు జస్మత్ పటేల్, మహేనర్ సింగ్, ఆర్కే జైన్, రిదేశ్, డా.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.