మన్మోహన్ విజనరీ లీడర్ :ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  • దేశం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నరు:వివేక్ వెంకటస్వామి 
  • స్కిల్ వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజనరీ లీడర్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొనియాడారు. ఆయన దేశం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ‘‘మన్మోహన్​సింగ్​మౌనంగా ఉంటారని కొందరు ముద్ర వేశారు. కానీ ఆయన విజనరీ లీడర్. దేశానికి మంచి జరుగుతుందని భావిస్తే, కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడేవారు కాదు. మన్మోహన్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖలు మారాయి” అని అన్నారు. దేశాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్ ఎప్పుడూ ముందుండేవారని చెప్పారు.

మన్మోహన్ మృతికి సంతాపంగా సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై వివేక్ మాట్లాడారు. 1991 నుంచే మన్మోహన్ కు, కాకా వెంకటస్వామికి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘అప్పట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి​శాఖ మంత్రిగా ఉన్న కాకా వెంకటస్వామి.. ఆ శాఖకు నిధులు పెంచాలని ఆనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మన్మోహన్ ను కోరారు. దీంతో ఆయన రూ.5 వేల కోట్లుగా ఉన్న రూరల్​డెవలప్​మెంట్ బడ్జెట్ ను రూ.25 వేల కోట్లకు పెంచారు. మన్మోహన్​ప్రధానిగా ఉన్న టైమ్ లో నేను ఎంపీగా ఉన్నాను. అప్పుడు రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని కోరాను.

రూ.10 వేల కోట్ల రుణం మాఫీ చేస్తే ఫ్యాక్టరీ రీఓపెన్​ అవుతుందని చెప్పాను. మన్మోహన్ వెంటనే స్పందించి రుణం మాఫీ చేసి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించారు. దీంతో దాదాపు 5 వేల ఉద్యోగాలు వచ్చాయి” అని గుర్తు చేశారు. 

భారతరత్న ఇవ్వాలి.. 

స్కిల్​ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి వివేక్ విజ్ఞప్తి చేశారు. ఆయన  విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘మన్మోహన్ చేసిన కృషితోనే మన దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు పయనిస్తోంది. ఉపాధి హామీ లాంటి గొప్ప పథకాలను ఆయన అమలు చేశారు.

మన్మోహన్ ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త అని ఒబామా కొనియాడారు” అని గుర్తు చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ కీలక పాత్ర పోషించారు. ఉద్యమం టైమ్ లో మేం పార్లమెంట్​లో ఆందోళన చేస్తుంటే, ఆయన ఏనాడూ ఒక్క మాట అనలేదు. మమ్మల్ని పిలిపించుకుని కచ్చితంగా తెలంగాణ ఇస్తామని చెప్పారు” అని పేర్కొన్నారు.