చెన్నూరులో 100 కోట్లతో అభివృద్ధి పనులు..నెల రోజుల్లో కంప్లీట్​ చేస్తం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో 100 కోట్లతో అభివృద్ధి పనులు..నెల రోజుల్లో కంప్లీట్​ చేస్తం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేదని మండిపాటు
  • మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ

కోల్‌‌బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ రాక్షస పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని, అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా పాలనను ఆదరించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూరు, మందమర్రి మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సీఎస్‌‌ఆర్, ఎస్‌‌టీఎస్ డీపీ ఫండ్స్‌‌తో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం వివేక్‌‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు.

మాజీ సీఎం కేసీఆర్ రూ.60 వేల కోట్ల ఫండ్స్‌‌తో చేపట్టిన మిషన్ భగీరథ స్కీం ద్వారా నీళ్లు రావడం లేదని, ఇది ఒక ఫెల్యూలర్ ప్రాజెక్ట్​అన్నారు. ఈ స్కీం ఫండ్స్‌‌ను బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదింటిని నెరవేర్చిందని తెలిపారు. మిగిలిన హామీలను కూడా క్రమంగా నెరవేర్చుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. ఫ్యామిలీ కార్డుల మంజూరు తర్వాత అన్ని సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయని తెలిపారు.

రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, వచ్చే నెలలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల అందజేస్తుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ స్కీంను రూ.10 లక్షలకు పెంచి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటుందని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ సీఎం రిలీఫ్‌‌ ఫండ్‌‌కు రూ.450 కోట్లను కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ.950 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. విద్యార్థులకు మంచి భోజనం అందించేలా హాస్టల్ మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని వెల్లడించారు. 

రూ.2.96 కోట్ల అభివృద్ధి పనులు 

చెన్నూరు నియోజకవర్గం జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లోని ముదిగుంట, కిష్టపూర్, మిట్టపల్లి, ఇందారం, వెంకట్రావుపల్లి, గంగిపల్లి, శివ్వారం, భీమారం, మద్దికల్, ఎల్కేశ్వరం, కొత్తపల్లి, బావురావుపేట, అక్కెపల్లి గ్రామాల్లో రూ.2.36 కోట్ల సీఎస్‌‌ఆర్, ఎస్టీఎస్‌‌డీఎఫ్ ఫండ్స్‌‌తో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.60 లక్షల ఫండ్స్‌‌తో చెన్నూరులోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ భవనానికి వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు.

స్కూల్ పిల్లల కోసం డైనింగ్ హాల్ నిర్మాణానికి, భీమారం మండల కేంద్రంలో వైకుంఠధామం వెహికల్‌‌కు, దుబ్బాపల్లి చెరువు కట్ట వరకు రోడ్డు నిర్మాణానికి ఫండ్స్ కేటాయిస్తానని, దుబ్బపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో తాగునీటి కోసం బోర్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో 42 మందికి సీఎం రిలీప్​ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర చెక్కులను అందజేశారు. ఇందారం గ్రామంలో పోచమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయా మండలాల్లో ఎమ్మెల్యే వివేక్‌‌ను ఘనంగా సన్మానించారు. 

హామీ ఇచ్చినట్లే అమలు చేస్తున్నా.. 

బీఆర్ఎస్​సర్కార్ నిర్లక్ష్యంతో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివేక్ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయా సమస్యలపై దృష్టి పెట్టానన్నారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల ఏర్పాటు పనులను చేపట్టామన్నారు.

ఇందుకోసం నియోజకవర్గ పరిధిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో నెలలో ఈ పనులన్నీ పూర్తవుతాయని వెల్లడించారు. చెన్నూరు మున్సిపాలిటీ వార్డుల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అమృత్ స్కీం ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై పనులు చేపట్టామని, వీటిని ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ ఫండ్స్ ప్రత్యేకంగా కేటాయించాలని మున్సిపల్ సెక్రటరీని కోరనున్నట్లు తెలిపారు.