
- స్పెషల్ ఫండ్స్‌తో ఈద్గా, దర్గాలకు మౌలిక సదుపాయాలు
- ముస్లింలకు నేను, ఎంపీ వంశీకృష్ణ అండగా ఉంటామని హామీ
- చెన్నూరు ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటానని వెల్లడి
కోల్ బెల్ట్, వెలుగు: మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.1.06 కోట్లతో ఈద్గా, దర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రిలో రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు రద్దు కోసం తన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో కొట్లాడుతున్నారని, బిల్లును రద్దు చేయాలని పార్లమెంటులో మాట్లాడారన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ఎంపీగా వంశీకృష్ణ, ఎమ్మెల్యేగా తాను కృషి చేస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగించిన మాజీ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడంతో తాను కీలకంగా వ్యవహరించానన్నారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడినందుకు తన మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా తన ఫ్యాక్టరీలను మూసివేయించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తుచేశారు. కాకా కుటుంబం చేసిన సేవలను కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు. మంత్రి పదవి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
వైద్య సేవల్లో వన్ మెడిహబ్ ముందుంటుంది..
అన్ని వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వన్ మెడిహబ్ మొబైల్ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో వన్ మెడిహబ్ మొబైల్ ఫ్రీ మెడికల్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. వన్ మెడిహబ్ మొబైల్ మెడికల్ క్యాంప్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా మందమర్రిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందులో 20 రకాల వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించాలన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయని, అవి కంట్రోల్‌లో ఉండాలంటే ఉప్పు, కారం, నూనె తగిన మోతాదులో వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివేక్ సూచించారు. వన్ మెడిహబ్ నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకారంతో తొలిసారి తమ సేవలను మందమర్రిలో ప్రారంభించామని చెప్పారు. తొలిసారిగా 300 మందికి వైద్య సేవలు అందించామన్నారు. ఈ క్రమంలో వివేక్ వెంకటస్వామి స్వయంగా పలువురికి వైద్య పరీక్షలు చేశారు.
ఆయన వెంట మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, ప్రభుత్వ వైద్యుడు రమేశ్ తదితరులు ఉన్నారు. మరోవైపు, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి స్థానిక కాంగ్రెస్లీడర్ బండారి నగేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, అమ్మ గార్డెన్స్ బస్ స్టేజ్ వద్ద ఎస్‌ఆర్‌కే టీ స్టాల్‌ను ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు.