గోదావరిఖని, వెలుగు : మే డే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడే సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో వీరాంజనేయ హమాలీ సంఘం ఆఫీస్ వద్ద జెండా ఎగురేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, కార్మికుల కోసం కాకా తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
కాకా కుటుంబం ఎప్పుడూ కార్మికుల పక్షం నిలబడిందని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కుమారస్వామి, సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డిని వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కార్మికుల గొంతుకనవుతానన్నారు.
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరామ్, తదితర కంపెనీలలో పనిచేసే పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతానన్నారు. తాను సొంతంగా ఆటమ్ సోలార్ రూఫ్‌ను తయారు చేశానని, దీనికి అమెరికా ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నారు. గత పాలకులు ఈ ప్రాంతంలో ఇసుక, బూడిద దందాలు, భూ కబ్జాలు, ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల దందాలు చేస్తూ నిరుద్యోగుల కడుపు కొట్టారని ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి
గోదావరిఖని, వెలుగు : దేశం, రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజ్‌ఠాకూర్, వివేక్‌వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వ్యాపారులను కోరారు. బుధవారం గోదావరిఖని వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌లో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. కాకా వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
వీరి వెంట కార్పొరేటర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ లీడర్ మోహిద్ సన్నీ ఏర్పాటు చేసిన ప్రచార కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ప్రారంభించారు. అంతర్గాం మండలం లింగాపూర్‌లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్ ఉపాధి కూలీలను కలిసి ప్రచారం నిర్వహించారు.