ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి చొరవతో ..రూ.800 కోట్ల అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి చొరవతో ..రూ.800 కోట్ల అభివృద్ధి పనులు
  • టీపీసీసీ జనరల్​ సెక్రటరీ రఘునాథ్​ రెడ్డి
  • ఓర్వలేక బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ఆరోపణలు

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో నియోజకవర్గంలో 14 నెలల కాలంలోనే రూ.800 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని టీపీసీసీ జనరల్​ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్​లోని కాంగ్రెస్ ​పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్​ ప్రెసిడెంట్​పల్లె రాజుతో కలిసి ఆయన మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి, ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్​గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ స్థానిక​ లీడర్ రాజారమేశ్​కు లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ​సర్కార్​చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్​ఆశించి భంగపడ్డ రాజారమేశ్​అక్కసుతో బీఆర్ఎస్​లో చేరి ఇప్పుడు సీఎం, రాహుల్​ గాంధీ, ఎమ్మెల్యేపై నిందలు వేస్తున్నాడని ఫైర్​ అయ్యారు.

రూ.100 కోట్లతో జోడువాగుల వంతెన వద్ద ఫోర్ ​లేన్​ హైవే నిర్మాణం, రూ.100 కోట్లతో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అమృత్​ స్కీం ద్వారా డ్రికింగ్​ వాటర్ సప్లై పనులు, రూ.250 కోట్లతో చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫండ్స్ మంజూరు చేయించారని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి పూర్తిచేసేందుకు కేంద్రం రూ.18 కోట్లు చెల్లించేలా చొరవ చూపారన్నారు. ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నా బీఆర్ఎస్​లీడర్లకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ హయంలో  రూ.1.25 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోవడంతో చుక్క నీళ్లు రాని పరిస్థితి నెలకొందన్నారు.

కాంగ్రెస్​ నేతలను విమర్శించే స్థాయి రాజారమేశ్​కు లేదని, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఊరుకోబోమన్నారు. సమావేశంలో కాంగ్రెస్​ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్​ గౌడ్, ​పలిగిరి కనకరాజు, మున్సిపల్​మాజీ చైర్మన్, వైస్​ చైర్మన్​ జంగం కళ, ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, కుర్మ సురేందర్, బుడిగె శ్రీనివాస్, రామకృష్ణ, కట్ల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.