మా పోరాటం ఆగదు : వివేక్ వెంకటస్వామి

మా పోరాటం ఆగదు : వివేక్ వెంకటస్వామి
  • మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడ్తాం: వివేక్ వెంకటస్వామి
  • దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నరు 
  • మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు 
  • సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తామని వెల్లడి
  • గుంటూరులో మాలల సింహగర్జన సభ 

హైదరాబాద్, వెలుగు: దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పి కొట్టే వరకూ తమ పోరాటం ఆగదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. కొందరు కావాలనే మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఏపీలోని గుంటూరులో అఖిల భారత మాల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరిగింది. ఇందులో అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. “మాలలు ఇంట్లో కూర్చుంటారు. 

బయటకు రారని కొందరు విమర్శలు చేస్తున్నారు. మేం సమయం వచ్చినప్పుడే బయటకు వస్తామని సింహగర్జన సభల ద్వారా నిరూపించాం. అంబేద్కర్ నిజమైన వారసులు  మాలలే. అంబేద్కర్ మాల, మాదిగ అని తేడా చూడకుండా.. దళితుల కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని విమర్శించే వారిపై మా పోరాటం ఆగదు” అని చెప్పారు. 

జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నారు. అయితే ఏపీలో దళితులకు  25% రిజర్వేషన్లు కల్పించాలి. ఈ అంశంపై తీర్మానం చేద్దాం. దీనికోసం మాలలంతా ఐక్యంగా కొట్లాడాలి” అని పిలుపునిచ్చారు. అంబేద్కర్ వల్లనే దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఆయన తన కుటంబానికి కూడా టైమ్ ఇవ్వకుండా దళితుల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. 

మాలల సత్తా చూపెట్టినం.. 

ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని వివేక్ చెప్పారు. ‘‘ఇప్పుడు గుంటూరులోనూ సింహగర్జన సభ విజయవంతమైంది. మాలల సత్తా ఏంటో చెప్పడానికి ఈ సభలే నిదర్శనం. మాలల సింహగర్జన నిర్వహించాలనే ఉద్దేశంతో నేను, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్ని జిల్లాల్లో పర్యటించాం. అందరినీ ఏకం చేశాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరేడ్ గ్రౌండ్ సభకు జనం తరలివచ్చారు.

కుల మీటింగ్​కు ఇంత భారీ స్థాయిలో జనం రావడం దేశంలో ఇదే తొలిసారి” అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. కులగణన చేశాకే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మాలలు దోచుకున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

ఇకపై అలాంటి ప్రచారం చేస్తే ఊరుకోం. జనాభా పరంగా మాలలు ఏపీలో ఫస్ట్ ప్లేసులో ఉంటే, తెలంగాణలో రెండో స్థానంలో ఉన్నారు. మాలలందరం ఐక్యంగా ఉండాలి. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జేడీ శీలం, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు , మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఆర్ఎస్ఎస్​పైనే మన పోరాటం: కేఆర్ నాగరాజు 

మాలలను రాజకీయంగా అణగదొక్కాలని కొందరు చూస్తున్నారని, అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. ‘‘మనం కొట్లాడాల్సింది కేంద్ర ప్రభుత్వంతో కాదు.. ఆర్ఎస్ఎస్ భావజాలంపై మనం కొట్లాడాలి. ఈ భావజాలాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు. మన దేవుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఆ దుర్మార్గుల మీద మనం కొట్లాడాలి” అని అన్నారు. తెలంగాణలో అందరినీ ఏకం చేసి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సింహగర్జన సభను గ్రాండ్ సక్సెస్ చేశామని, మాలల సత్తా ఏంటో చూపించామని చెప్పారు. 

సుప్రీం తీర్పును మాదిగలు వ్యతిరేకిస్తున్నరు: హర్షకుమార్  

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిగలంతా వ్యతిరేకిస్తున్నారని, కేవలం తెలుగు రాష్ట్రాల మాదిగలు మాత్రమే స్వాగతిస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ‘‘మాలలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారు. మీటింగ్ కు వస్తున్నోళ్లను  అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ జనం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. సభ విజయవంతమైంది. వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు హైదరాబాద్​లో మాలల సింహగర్జనను గ్రాండ్ సక్సెస్ చేశారు”  అని చెప్పారు.