బలహీన వర్గాల గురించే గద్దర్ ఆలోచించేవారు: గద్దరన్న యాదిలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్థంతి సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకు నివాళులర్పించారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతిని రవీంద్ర భారతిలో ‘‘గద్దరన్న యాదిలో’’ అనే పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. గద్దర్కు పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్దర్తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

గద్దర్ను తన తండ్రి వెంకటస్వామి చాలా ప్రేమించేవారని, గద్దర్ చరిత్ర అందరూ తెలుకోవాలని, చదువుకోవాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. గద్దర్ పోరాటం జననాట్యమండలి ద్వారా పాట రూపంలో చూపించేవారని, చాలా ఉద్యమాలు చేసి నష్టపోయారని తెలిపారు. భార్యా, పిల్లల్నిగద్దర్ కష్టపడి చూసుకున్నారని గుర్తుచేశారు. గద్దర్ ఎప్పుడూ బలహీన వర్గాలని ఎలా ఆదుకోవాలనే ఆలోచించేవారని, బుల్లెట్ గాయాలు ఉన్నా కూడా ఎప్పుడూ భయపడలేదని.. కుటుంబం కంటే ప్రజల గురుంచే ఎప్పుడూ ఆలోచించేవారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ‘గద్దరన్న యాదిలో’ కార్యక్రమంలో మాట్లాడారు.ప్రజల కోసం గద్దర్ అనేక ఉద్యమాలు చేశారని వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ముందుండి పోరాడారని కొనియాడారు.

గద్దర్ తన జీవితమంతా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసమే అంకితం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పుడు ఆయన పాడిన పాటలు ఉద్యమ కాంక్షను ప్రతిబింబిచాయని గుర్తుచేశారు. గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం తన తండ్రితో కలిసి పని చేసిన వారిని ఏకం చేయడమేనని చెప్పారు. ప్రతి పోరాటంలో నాన్న పాట, పోరాటం త్యాగం ఉందని తన తండ్రిని ఆయన గుర్తుచేసుకున్నారు.

 

‘‘గద్దరన్న యాదిలో’’ పాలుపంచుకున్న పలువురు ప్రముఖులు ఏం మాట్లాడారంటే..

 

పాశం యాదగిరి :

* గద్దర్ అంటే భగత్ సింగ్ 
* గద్దర్ దేశం కోసం ప్రజల కోసమే తిరిగిండు.
* గద్దర్ పేరు మీద యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలి.
* ఆయన చేసిన పని అందరికి తెలియాలి అంటే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

 

ప్రొఫెసర్ హరగోపాల్:

* గద్దర్ తెలంగాణ చైతన్యం నుంచి పుట్టాడు.
* ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చాడు.
* గద్దర్ మాట అందరిని ఆలోచింప చేస్తుంది.
* గద్దర్ కళ చరిత్రలో నిలిచిపోతుంది.
* తెలంగాణా ఉద్యమం గద్దర్ చైతన్యంతో ముందుకు వెళ్ళింది.

 

పరుచూరి గోపాల కృష్ణ ( సినిమా రచయిత):

* నాకంటే చిన్నవాడు గద్దర్. కానీ తనని అన్న అనే పిలిచేవాణ్ణి. 
* గద్దరన్న పాట పాడితే అట్టడుగు ప్రజల వరకు గళం వెళ్తుంది.
* చిత్రపురి కాలనీలో ఆయనకు గుర్తుగా ఇల్లు ఇస్తున్నాం.
* గద్దర్ కి నాకు చాలా అనుబంధం ఉంది.
* గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించిన సీఎం రేవంత్ కి ధన్యవాదాలు.