
కేసీఆర్ సీఎం అయ్యాక సింగరేణిలో 23 వేల ఉద్యోగాలను తొలిగించారని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సరిగ్గా వినియోగించుకుని కొత్త గనులు తీసుకువస్తే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేదన్నారు. కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే యవతకు ఉద్యోగాలు రాలేదన్నారు. ఈ ప్రాంతలో మూడు కొత్త గనులు అప్పుడే తెచ్చుంటే కనీసం ఐదు వేల ఉద్యోగాలు వచ్చుండేవని చెప్పారు.
సింగరేణిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగం కల్పించాలని తాను సీఎం రేవంత్ ను కోరానన్నారు వివేక్ వెంకటస్వామి. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు. త్వరలో మందమర్రితో పాటుగా మరో రెండు ప్రాంతాల్లో స్కిల్ డెవలప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు వివేక్. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని వెల్లడించారు.
సింగరేణి సంస్థ రూ. వేల కోట్ల లాభాల్లో ఉందని, బయట అందరు అనుకుంటున్నారని, కానీ, ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు వివేక్ వెంకటస్వామి . బీఆర్ఎస్ సర్కార్, టీబీజీకేఎస్ నిర్లక్ష్యంతో సంస్థ అప్పుల పాలైందని ఆరోపించారు. నిధుల్లేకపోవడంతో కొత్త గనులు తవ్వలేకపోయారని, కనీసం కార్మికులకు కొత్త క్వార్టర్స్ కూడా నిర్మించలేని దుస్థితికి తీసుకొచ్చారని చెప్పారు.
రేపే సింగరేణి ఎన్నికలు
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్‌లలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు ను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకోనున్నారు. ఇన్నాళ్లు కార్మిక సంఘాలు గనులపై చేపట్టిన ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, టీబీజీకేఎస్, ఇప్టూ, విప్లవ కార్మిక సంఘాలతో పాటు 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీపడ్తున్నాయి. సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు.